
వారాహి చలన చిత్రం.. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ. నిర్మాత సాయి కొర్రపాటి తన అభిరుచికి తగ్గట్టుగా మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఈ బ్యానర్‌ను రోజు రోజుకూ మరింత విస్తరిస్తున్నారు. ఇక సినీ నిర్మాణంలోనే కాక డిస్ట్రిబ్యూషన్ పరంగానూ పలు సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన సాయి కొర్రపాటి, ఈ మధ్యకాలంలో వినూత్న పంథాలో రూపొందే చిన్న సినిమాలకు అండగా నిలబడుతున్నారు.
ఇప్పటికే దసరా కానుకగా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన ‘రాజు గారి గది’ సినిమాకు ఈ స్థాయి మార్కెట్ కల్పించిన సాయి కొర్రపాటి, తాజాగా మరో చిన్న సినిమాకు అండగా నిలబడడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. అశ్విన్, తేజస్విని హీరో, హీరోయిన్లుగా రాకేష్ దర్శకత్వంలో రూపొందిన ‘జత కలిసే’ అన్న సినిమాను మొత్తంగా సొంతం చేసుకొని విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఇప్పటికి పెద్దగా పరిచయం లేని ఈ సినిమా ఇకపై పాపులర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగులో పేరొందిన నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి ఇలా సరికొత్త కథాంశాలతో నిర్మించే ఎంటర్టైనింగ్ సినిమాలకు అండగా నిలబడడం విశేషంగా చెప్పుకోవచ్చు.

