క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు మొదటి వారంలో అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రలో ఆయన పెద్ద మనవడు సుమంత్ నటిస్తున్నారని చిత్రబృందంతో పాటు, సుమంత్ కూడా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సుమంత్ తన తాతగారి పాత్రను పోషించడానికి రెడీ అయిపోయారు. ఈ రోజే ఆయన ఎన్టీఆర్ బయోపిక్ షూట్ లో జాయిన్ అయ్యారు.
అయితే సుమంత్ ఎంట్రీ చాలా ఆసక్తికరంగా ఉందని చిత్రయూనిట్ చెబుతుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఏఎన్నార్ చనిపోయే ముందు ఆయన చివరిగా ఉపయోగించిన కారులో సుమంత్ షూటింగ్ ప్రదేశానికి వచ్చారట. ఏఎన్నార్ కారులో ఏఎన్నార్ గెటప్ లో వచ్చిన సుమంత్, అచ్చం ఏఎన్నార్ లానే ఉన్నారని చిత్రబృందం చెబుతుంది. అక్కినేని మరియు నందమూరి అభిమానులు కూడా సుమంత్ ఏఎన్నార్ లా ఎలా నటిస్తారో అని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


