రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా తాజాగా వర్మ ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశాడు. దీంతో తెలుగు తమ్ముళ్లకు ఈ చిత్రం పై భయం పట్టుకుంది. ఎక్కడ తమ మనోభావాలకు వ్యతిరేకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వర్మ తెరకెక్కిస్తాడేమోనని టీడీపీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా వర్మ అలాంటి వారి అనుమానాలకు సమాధానంగా.. ‘ఈ సినిమా పై చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి. వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. నేను ఈ సినిమాలో అందరికీ తెలిసిన అంశాలనే ప్రస్తావిస్తున్నాను, కొత్తగా ఏం చూపించను. అందరికి తెలిసిన అంశాలనే చెబుతున్నప్పుడు, ఇంక భయపడాల్సిన అవసరం ఏముంది ? అని వర్మ ఎదురు ప్రశ్నిస్తున్నాడు.
అయితే వర్మ మాటలను బట్టి ఆలోచిస్తే.. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి కలిగిన వెన్నుపోటు ఘట్టం కంటే కూడా.. తెలుగు వెండితెర పై ఆరాధ్య దైవంగా కోట్లాది ప్రజలు చేత గౌరవింప బడ్డ ఎన్టీఆర్.. ఒక సామాన్య స్త్రీని.. అందులో అరవై సంవత్సరాల వయసులో ఆయనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? లాంటి అంశాలనే వర్మ విశ్లేషాత్మకంగా ఈ చిత్రంలో చూపించనున్నాడని తెలుస్తోంది.


