మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘గని’ అనేది టైటిల్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేయాలని ముందుగా టీమ్ భావించారు. కానీ అదే రోజున ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానుంది. ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ. కాబట్టి ఆ సినిమాతో పోటీ అంటే థియేటర్లు, ఓపెనింగ్స్ అన్నీ కష్టమే.
అందుకే చిత్ర బృందం మరొక డేట్ చూసుకుంటున్నారని టాక్. సినిమా అయితే జూలై నెలలోనే వస్తుందట. జూలై మొదట్లో ‘మేజర్’ రిలీజ్ ఉండగా మధ్యలో జూలై 16న మరొక పాన్ ఇండియా చిత్రం ‘కెజిఎఫ్ 2’ విడుదల ఉంది. కాబట్టి ‘మేజర్, కెజిఎఫ్ 2’ మధ్యలోనే ఏదైనా డేట్ చూసుకునే యోచనలో ఉన్నారట ‘గని’ టీమ్. ‘గద్దలకొండ గణేష్’ లాంటి మంచి విజయం తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో మంచి హైప్ ఉంది ప్రేక్షకుల్లో. వరుణ్ సైతం ఈ చిత్రం కోసం చాలానే కష్టపడుతున్నారు. విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ శిక్షణ తీసుకుని వచ్చారు. అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానుంది.


