
వైష్ణవ్ తేజ్ తన మొదటి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకాకముందే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు రెండవ సినిమా. పెద్దగా హడావిడి లేకుండానే సినిమా మొదలుపెట్టి, చిత్రీకరణ ముగించేశారు టీమ్. ఏకధాటిగా జరిగిన 45 రోజుల షెడ్యూల్లో షూటింగ్ మొత్తం ముగిసింది. ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` నవలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించడం జరిగింది.
ఇక గత వారం విడుదలైన ‘ఉప్పెన’ సూపర్ సక్సెస్ దిశగా వెళుతోంది. భారీ వసూళ్లను రాబట్టుకుంటూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో వైష్ణవ్ తేజ్ మీద అంచనాలు పెరిగాయి. రెండవ సినిమా కూడ గొప్పగా ఉండాలని అంచనాలు పెట్టుకుంటున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం అందరి దృష్టి క్రిష్ సినిమా మీదే పడింది. క్రిష్ సినిమాలంటే తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కథతో పాటు నటీనటులకు తమలోని నటనా పటిమను ప్రదర్శించే అవకాశం కూడ దొరుకుతుంది.
అందుకే ఈ చిత్రం మీద కొత్త అంచనాలు ఏర్పడుతున్నాయి. ట్రేడ్ వర్గాలు సైతం ‘ఉప్పెన’ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ధర చెల్లించి హక్కులను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి ‘ఉప్పెన’ విజయం క్రిష్ సినిమాకు మంచి ఊపునిచ్చిందనే అనాలి. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించారు.

