టాలీవుడ్లో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెతో టాలీవుడ్లో షూటింగ్స్ అన్ని కూడా బంద్ అయ్యాయి. అయితే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చొరవతో తాజాగా నిర్మాతలతో ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ నుంచి అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్నకుమార్ హాజరుకాగా.. ఫెడరేషన్ నుంచి కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు హాజరయ్యారు. అటు నిర్మాతల నుంచి దిల్ రాజు, సి. కళ్యాణ్, భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, ఎస్.కె.న్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచిభొట్ల, స్రవంతి రవి కిషోర్, డైరెక్టర్ తేజ, వైవిఎస్ చౌదరి, రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సుధీర్ఘంగా జరిగిన ఈ చర్చలో నిర్మాతలు కార్మికుల ముందు కొన్ని షరతులు పెట్టారు. అయితే, ఈ షరతులు ఏ ఒక్కటికీ ఫెడరేషన్ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ చర్చలు విఫలం అయ్యాయి. ఈ పరిణామంతో కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.


