నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘భూతం ప్రేతం’ చిత్రం నుంచి హుషారైన పార్టీ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ పతాకాలపై బి. వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్నారు.
‘చికెన్ పార్టీ’ అంటూ సాగే ఈ గీతాన్ని దర్శకుడు రాజేష్ ధృవ స్వయంగా రచించగా, అనిరుధ్ శాస్త్రి ఆలపించారు. గిరీష్ హోతుర్ సమకూర్చిన సంగీతం పార్టీ మూడ్‌కు తగ్గట్టుగా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో స్పందన లభిస్తోంది. ఈ పాటలో యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్ తదితరులు సందడి చేశారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. యోగేష్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఉజ్వల్ చంద్ర ఎడిటర్‌గా పని చేస్తున్నారు.


