ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జనవరి 9, 2026
స్ట్రీమింగ్ వేదిక : సోని లివ్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : సిద్ధాంత్ గుప్త, చిరాగ్ వోహ్ర, రాజేంద్ర చావ్లా, ల్యూక్ మెక్గిబ్ని, కార్డీలియా బుగెజా, ఆరిఫ్ జకారియా, తదితరులు
దర్శకత్వం : నిఖిల్ అద్వానీ
నిర్మాతలు : నిఖిల్ అద్వానీ, మోనిషా అద్వానీ, మధు భోజ్వాని
సినిమాటోగ్రఫీ : మలేయ్ ప్రకాష్
సంగీతం : అశుతోష్ పాఠక్
ఎడిటర్ : శ్వేతా వెంకట్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
2024లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోని లివ్‌లో వచ్చిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ (Freedom At Midnight) వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ల్యారీ కొల్లిన్స్, డొమినిక్ లాపియెర్రె రచించిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ (Freedom At Midnight) నవల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌ను (Freedom At Midnight S2) మేకర్స్ రిలీజ్ చేశారు. జనవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
(Freedom At Midnight S2) కథ :
తొలి సీజన్‌లో భారత్ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని మనకు చూపెట్టారు. ఇక ఇప్పుడు రెండో సీజన్‌లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అఖండ భారతం రెండు ముక్కలుగా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది.. ఈ క్రమంలో సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, నెహ్రూ, గాంధీ ఎలాంటి అడుగులు వేశారు అనేది మనకు చూపెట్టారు. భారత్-పాక్ విభజన క్రమంలో జరిగే హింసాత్మక ఘటనలు, వాటి నేపథ్యంలో దేశంలో జరిగే మారణకాండను మనకు ఇందులో చూపెట్టారు. అయితే, పాక్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలని గాంధీ ఎందుకు నిరాహారదీక్ష చేశారు..? పాక్ గాంధీని ఎలా చూసింది..? గాంధీ మరణం వెనుక ఉన్న వాస్తవ ఘటనలను మనకు ఇందులో చూపెట్టారు.
ప్లస్ పాయింట్స్ :
‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ (Freedom At Midnight) సీజన్ 1ను ఎక్కడ అయితే ముగించారో, అక్కడి నుంచి (Freedom At Midnight S2) సీజన్ 2 కథను కొనసాగించిన తీరు బాగుంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగే పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.. ప్రజల మధ్య కుల మత విద్వేషాలు ఏ స్థాయిలో ఉండేవో మనకు చూపెట్టారు. అయితే, దేశంలో నెలకొన్న అనిశ్చితిని ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నది మనకు ఇందులో చూపెట్టిన తీరు బాగుంది.
రెండు దేశాల మధ్య పంపకాలు ఏ విధంగా జరిగాయో మనకు కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. ఇక దేశంలోని పలు రాజ్యాలను ఒక తాటి కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా జరిగాయో కూడా అద్భుతంగా చూపెట్టారు. పాక్-ఇండియా మధ్య నెలకొన్న వైరం, కశ్మీర సున్నితమైన అంశంగా ఎందుకు మారిందనే అంశాలు కూడా చక్కగా ప్రజెంట్ చేశారు.
ఇక గాంధీ చేపట్టిన నిరాహార దీక్ష, ఆయన మరణంపై ఎలాంటి కుట్రలు జరిగాయి, ఆయన్ను ఎలా హతమార్చారు అనే పాయింట్స్ ఆకట్టుకుంటాయి. నెహ్రూ-పటేల్ మధ్య జరిగే కోల్డ్ వార్ సీన్స్ ఎంగేజ్ చేస్తాయి. మొత్తంగా ఈ వెబ్ సిరీస్‌తో దర్శకుడు ప్రేక్షకులకు మన స్వాతంత్ర్యం అనంతరం జరిగిన సన్నివేశాలను బాగా చూపెట్టడంలో విజయం సాధించాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ వెబ్ సీరస్‌లో మేజర్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది రన్‌టైమ్ అని చెప్పాలి. ఒక్కో ఎపిసోడ్ సుమారు గంటపాటు సాగడం.. మొత్తం 7 ఎపిసోడ్స్ కూడా ఇదే విధంగా ఉండటంతో ప్రేక్షకులు చాలా ఓపికతో ఈ సిరీస్‌ను చూడాల్సి వస్తుంది. ఇక ఈ రెండో సీజన్‌లో చూపెట్టిన అంశాలను దర్శకుడు చాలా చక్కగా ప్రజెంట్ చేయడంతో ప్రేక్షకుల్లో చరిత్రపై ఎలాంటి నెగిటివిటీ వ్యాప్తి చెందదు.
నెహ్రూ-పటేల్ ల మధ్య వచ్చే సీన్స్ చాలా ఉంటాయి. అయితే, కొన్ని సీన్స్‌లో వారి మధ్య వచ్చే ఎమోషన్స్ కొంతమేర ట్రాక్ తప్పినట్లు అనిపిస్తాయి. ఇక కశ్మీర్ అంశాన్ని కూడా ఇంకాస్త్ బెటర్‌గా ప్రజెంట్ చేయాల్సింది. పాక్ విషయంలో గాంధీ తీసుకున్న నిర్ణయాలను కూడా కాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది.
కొన్ని ఎపిసోడ్స్‌లో స్లో పేస్ కారణంగా ప్రేక్షకుల్లో అక్కడక్కడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. గాంధీని హతమార్చాలి అనుకున్న వారి నేపథ్యాన్ని కూడా ఇంకాస్త బెటర్‌గా ప్రజెంట్ చేయాల్సింది. యాక్షన్ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా తీర్చిదిద్దాల్సింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు నిఖిల్ అద్వానీ మరోసారి ఈ వెబ్ సిరీస్‌ను ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. చరిత్రకు సంబంధించి చాలా విషయాలను ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా చూపెట్టారు. గాంధీ, నెహ్రూ, పటేల్, జిన్నా వంటి వారికి సంబంధించిన సీన్స్‌ను ఆయన తెరకెక్కించిన తీరు బాగుంది. దేశ విభజన తర్వాత వచ్చే సీన్స్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా ఆయన తీసుకున్న కేర్ ఆకట్టుకుంటుంది. మలేయ్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అప్పటి పరిస్థితులను మన కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. అశుతోష్ పాఠక్ బీజీఎం కథకు అనుకూలంగా సాగుతుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది.
తీర్పు :
ఓవరాల్‌గా ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ సీజన్ 2 (Freedom At Midnight S2) వెబ్ సిరీస్ ఒక హిస్టారికల్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. మన దేశ చరిత్రకు సంబంధించి ఎన్నో విషయాలను ఇందులో పొందుపరిచిన తీరు మెప్పిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, ఆసక్తికర కథనం ప్రేక్షకులను మెప్పిస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ స్లోగా సాగడం.. కొన్నిచోట్ల పాత్రల మధ్య వచ్చే సీన్స్ ట్రాక్ తప్పడం మైనస్. మన దేశానికి సంబంధించిన గతాన్ని.. దాని తాలూకా గాయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


