
సునీల్ శెట్టి
సన్నీ డియోల్, దిల్‌జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్ మరియు అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బోర్డర్ 2′(Border 2) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. 1997లో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘బోర్డర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, ఇప్పటికే దేశీయంగా రూ. 200 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటేసింది. ఈ విజయం చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
అయితే, ఈ సినిమాలో తన కుమారుడు అహాన్ శెట్టి నటించినప్పటికీ, సీనియర్ నటుడు సునీల్ శెట్టి(Suniel Shetty) మాత్రం సినిమాను ఇంకా చూడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా ప్రీమియర్ షో సమయంలో కూడా ఆయన థియేటర్ బయటే ఉండిపోయారు. తన కుటుంబ సభ్యులంతా లోపల సినిమా చూస్తుంటే, సునీల్ శెట్టి మాత్రం బయట అభిమానులతో ముచ్చటిస్తూ గడపడం చర్చనీయాంశమైంది.
దీనిపై సునీల్ శెట్టి స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “నేను మొదటి రోజే ఒక మొక్కు మొక్కుకున్నాను. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేసే వరకు నేను చూడకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అహంకారం కాదు, నా కొడుకు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ తీసుకున్న నిర్ణయం. థియేటర్ బయట కూర్చుని ప్రజలు సినిమా గురించి ఇస్తున్న ప్రశంసలు వింటుంటే ఎంతో గర్వంగా అనిపించింది” అని ఆయన చెప్పుకొచ్చారు.

