మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘మన శంకర వర ప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ ఇంకా బలంగా దూసుకుపోతోంది. రొటీన్ ఫార్ములాతో అనిల్ ఈసారి దెబ్బతింటాడని విమర్శకులు భావించినప్పటికీ, ఆయన తనదైన శైలిలో మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే, ఈ సినిమా డిజాస్టర్ కాకుండా ఉండటానికి తాను తీసుకున్న ఒక స్క్రీన్‌ప్లే నిర్ణయమే కారణమని అనిల్ రావిపూడి తాజాగా వెల్లడించారు. మొదట ఈ కథ కోసం ఆయన ఒక భిన్నమైన స్క్రీన్‌ప్లేని అనుకున్నారు. సాధారణంగా మంచి ఐడియా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సరిగా లేక చాలా సినిమాలు బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎడిటింగ్ సమయంలో అనిల్ ఆలోచించి, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారు.
సినిమాలో మంత్రి చిరంజీవిని అడిగినప్పుడు, తనూ శశిరేఖ ఎలా కలిశారు అనే దానికంటే ముందు, వారు ఎందుకు విడిపోయారు అనే పాయింట్‌తో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. ఆ తర్వాత వరప్రసాద్ తన పిల్లలను కలిసినప్పుడు, కూతురు ఇచ్చే ఒక చిన్న సిగ్నల్ ద్వారా శశిరేఖతో తన మొదటి పరిచయాన్ని గుర్తుచేసుకునేలా సీన్‌ను డిజైన్ చేశారు. ఈ చిన్న మార్పే సినిమాను ఒక డిజాస్టర్ కాకుండా బ్లాక్‌బస్టర్‌గా నిలిపిందని అనిల్ వివరించారు.


