మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి టాలీవుడ్‌లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విశేషమేమిటంటే, ఈ సినిమా ఏకంగా ఏడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, మరియు బెంగాలీ) స్ట్రీమింగ్ కానుంది.
ఒక తెలుగు సినిమా ఇంత తక్కువ సమయంలో ఇన్ని భాషల్లో ఓటీటీ విడుదల కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2026న డిజిటల్ ప్రీమియర్ కానుందని సమాచారం. చిరంజీవితో పాటు నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలకమైన గెస్ట్ రోల్‌లో మెప్పించారు. సచిన్ ఖేడేకర్, హర్ష వర్ధన్, జరీనా వహాబ్, కేథరిన్ థ్రెసా వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.


