వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఘనంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి, హీరో ఆనంద్ దేవరకొండ, నటి నిహారిక కొణిదెల హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ, “పరిశ్రమకు కొత్త రక్తం అవసరం. యంగ్ టీమ్ ఎంతో ఉత్సాహంతో చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి. ఇందులోని ఓ పాటను నేను పాడటం సంతోషంగా ఉంది” అని తెలిపారు. టీజర్‌లోని సహజత్వం, విజువల్స్ తనను ఆకట్టుకున్నాయని, హీరో పాత్రను చాలా కన్విన్సింగ్‌గా డిజైన్ చేశారని ఆనంద్ దేవరకొండ ప్రశంసించారు. దర్శకుడు వినయ్‌కు మద్దతుగా ఇక్కడికి వచ్చానని, ఇలాంటి ప్యాషన్ ఉన్న కొత్త టీమ్‌ను ప్రోత్సహించే నిర్మాతలు పరిశ్రమకు ఎంతో అవసరమని నిహారిక పేర్కొన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “ఇది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, నిజాయితీతో చేసిన ప్రయత్నం. అభద్రతా భావాన్ని (Insecurity) జయించి జీవితంలో ఎలా ఎదగాలి అనే స్ఫూర్తిని ఈ కథ ఇస్తుంది. అన్ని కోల్పోయాం అనుకునే వారికి ఈ సినిమా ధైర్యాన్ని నింపుతుంది” అని చిత్ర ఇతివృత్తాన్ని వివరించారు.
క్రౌడ్ ఫండింగ్ దశలో ఉన్న ఈ కథ నచ్చి, ఎక్కడా రాజీపడకుండా సినిమాగా నిర్మించామని నిర్మాత చింతా గోపాల కృష్ణారెడ్డి తెలిపారు. హీరో వంశీ ఈ చిత్రంలో ‘మెల్లకన్ను’ ఉన్న యువకుడిగా వైవిధ్యమైన పాత్రలో నటించారని, సింక్ సౌండ్‌తో సినిమాను చాలా సహజంగా తీర్చిదిద్దామని దర్శకుడు వినయ్ రత్నం వెల్లడించారు.


