బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బెంగాలీ సినీ, టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ అకాల మరణం, ఆ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన కొత్త ప్రాజెక్ట్ షూట్ కోసం రాహుల్ అరుణోదయ్ బెనర్జీ ఒడిశాలోని తలసరి బీచ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సముద్రం నేపథ్యంలో ఒక పడవ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ రాహుల్ అరుణోదయ్ బెనర్జీ నీటిలో పడిపోయారు. సిబ్బంది నీటి నుంచి బయటకు తీసే సమయానికి, ఆయన ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం ఆయన ప్రాణాలను బలి తీసుకోవడం నిజంగా బాధాకరం.
కోల్‌కతాలో జన్మించిన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ, 2008లో విడుదలైన ‘చిరోదిని తుమీ జే అమర్’ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు వచ్చింది. నటనతో పాటు దర్శకత్వం పై ఉన్న ఆసక్తితో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఆయన రూపొందించారు. రాహుల్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఇక మా 123తెలుగు.కామ్ తరఫున ‘రాహుల్ అరుణోదయ్ బెనర్జీ’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.


