ముఖ్య అంశాలు (KEY TAKEAWAYS)
- తమిళనాడు ఎన్నికల బరిలో తొలిసారి దిగిన టీవీకే అధినేత విజయ్.. తన మొత్తం చరాస్తుల విలువ రూ. 404.58 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేశారు.
- పెరంబూర్ స్థానం నుంచి నామినేషన్ వేసిన ఆయనకు దాదాపు రూ. 220 కోట్ల మేర స్థిరాస్తులు ఉండగా, ఎలాంటి బ్యాంకు అప్పులు లేవని వెల్లడించారు.
- కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లతో పాటు, ఆయన ఆస్తుల జాబితాలో ఒక సాధారణ టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ మోపెడ్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన సంపద లెక్కలు చూపించారు. దీని ప్రకారం విజయ్ పేరిట మొత్తం రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. అలాగే మరో రూ. 220 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందులో సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చినవి కూడా కలిపారు.
వందల కోట్ల ఆస్తులు ఉన్న విజయ్‌కు బ్యాంకుల్లో ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. నగదు రూపంలో తన దగ్గర కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఉంటాయని, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయల క్యాష్ ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) రూపంలో దాదాపు రూ. 388 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఇక బంగారు, వెండి ఆభరణాల విషయానికి వస్తే.. విజయ్ వద్ద సుమారు రూ. 1.20 కోట్ల విలువ చేసే 883 గ్రాముల బంగారం, రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పత్రాల్లో పొందుపరిచారు.
లగ్జరీ కార్ల మధ్యలో టీవీఎస్ ఎక్స్ఎల్
విజయ్ గ్యారేజీలో సుమారు రూ. 14.35 కోట్ల విలువైన వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ లాంటి హై-ఎండ్ లగ్జరీ కార్లు మెరుస్తున్నాయి. అయితే ఇంత ఖరీదైన కార్ల జాబితాలో ఒక సాధారణ మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు, టీవీఎస్ ఎక్స్ఎల్ (TVS XL Super) మోపెడ్ ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఒక స్టార్ హీరో, పైగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడి వద్ద ఇలాంటి సాధారణ వాహనం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
సినీ పరిశ్రమ, వ్యాపారాలు, వడ్డీలు, ఆస్తుల నుంచి వచ్చే అద్దెలే తన ప్రధాన ఆదాయ వనరులని విజయ్ తెలిపారు. గత ఐదేళ్ల ఆదాయాన్ని గమనిస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 184.53 కోట్ల మేర ఆదాయం ఆర్జించారు. అదే విధంగా 2023-24లో రూ. 105.69 కోట్లు, 2022-23లో రూ. 198.71 కోట్లు, 2021-22లో రూ. 237.46 కోట్లు వచ్చాయని అఫిడవిట్లో రాసుకొచ్చారు. ఇక 2020-21 కాలానికి గానూ తన భార్య సంగీతకు రూ. 6 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. పక్కా క్లారిటీతో, ఎలాంటి దాపరికాలు లేకుండా విజయ్ తన ఆస్తుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


