ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఈ శుక్రవారం విడుదలవుతోంది. వాస్తవానికి ఇది ప్రదీప్ రెండో సినిమాగా రావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో బజ్ గణనీయంగా తగ్గింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్స్ ప్రారంభమై 24 గంటలు గడిచినా, ఈ సినిమా కనీసం సేల్స్ చార్ట్స్‌లో కూడా చోటు సంపాదించలేకపోయింది. ఇదే సమయంలో “లెజెండ్” శరవణన్ నటించిన ‘లీడర్’ సినిమా 5.6 వేలకు పైగా టికెట్ల విక్రయాలతో దూసుకుపోతుంటే, ‘LIK’ కనీసం ట్రాకింగ్‌లో కూడా లేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం, వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య కీలక పాత్రలో ఉండటం వంటి అంశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అయినప్పటికీ, ఓపెనింగ్స్ విషయంలో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం లేదు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసి ప్రదీప్ రంగనాథన్‌కు హిట్‌ను అందిస్తుందా లేక కెరీర్‌లో మొదటి పరాజయంగా మిగిలిపోతుందా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.


