గత పదేళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో భారీ చిత్రాలకు మార్కెటింగ్, డిజిటల్ క్యాంపెయిన్స్‌ను విజయవంతంగా నడిపించిన పేరు శరత్ చంద్ర నాయుడు. ముఖ్యంగా అల్లు అర్జున్ టీమ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేశారు. ఇన్నాళ్లు తెరవెనుక తన వ్యూహాలతో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లిన ఆయన, ఇప్పుడు నేరుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
ఆయన నిర్మించిన డెబ్యూ వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం నిర్మాతగానే కాకుండా, ఈ సిరీస్ కోసం డైరెక్టర్ వినోద్, రైటింగ్ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో కూడా తన వంతు పాత్ర పోషించారు శరత్ చంద్ర. మార్కెటింగ్ రంగంలో ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకున్న అనుభవం, ఈ కథను మరింత బలంగా తెరమీదకు తీసుకురావడంలో బాగా ఉపయోగపడింది.
పాడ్‌కాస్ట్ నుంచి ఓటీటీ సిరీస్ దాకా..
అసలు ఈ వెబ్ సిరీస్ ఐడియా ఎలా పుట్టిందంటే.. శరత్ చంద్ర నడుపుతున్న ‘రేలంగి మావయ్య’ అనే ఇన్‌స్టాగ్రామ్ పాడ్‌కాస్ట్ పేజీనే దీనికి స్పూర్తి. 90ల నాటి జ్ఞాపకాలను తన వాయిస్‌తో ఎంతో అద్భుతంగా ఆ పేజీలో చెబుతుంటారు. దానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన కనెక్టివిటీ, స్పందన వచ్చాయి. ఆ ఎమోషన్స్‌ను గమనించిన ETV Win టీమ్ (సాయి, నితిన్) ఈ కాన్సెప్ట్‌ను వెబ్ సిరీస్‌గా మలిస్తే బాగుంటుందని భావించారు. అలా ‘గుర్తుకొస్తున్నాయి’ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.
ఈ ప్రయాణంలో శరత్ చంద్రకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి దక్కిన సపోర్ట్ మరింత ప్రత్యేకం. ఇన్నాళ్లు తన టీమ్‌లో ఉంటూ, ఇప్పుడు నిర్మాతగా మారిన శరత్‌ను బన్నీ ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. టాలెంట్ ఉంటే అల్లు అర్జున్ క్యాంప్ ఎప్పుడూ ముందుండి ప్రోత్సహిస్తుందనడానికి ఈ సంఘటన ఒక మంచి ఉదాహరణ.
సినిమా ప్రమోషన్స్ చేయడం, క్యాంపెయిన్స్ డిజైన్ చేయించడం మాత్రమే కాకుండా, ఇప్పుడు ఒక అందమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో శరత్ తన ప్రతిభను నిరూపించుకున్నారు. మార్కెటింగ్‌లో నేర్చుకున్న పాఠాలు, ప్రేక్షకుల నాడి పట్టుకునే విధానం తనకి నిర్మాతగా ఎంతో హెల్ప్ అయ్యాయని ఆయన చెబుతున్నారు. ‘గుర్తుకొస్తున్నాయి’ సక్సెస్‌తో శరత్ చంద్ర నాయుడు కెరీర్‌లో ఒక కొత్త, ఆసక్తికరమైన అధ్యాయం మొదలైంది.


