విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనకాపల్లి’ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఓ కీలక పాత్రలోనూ నటించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను నిర్మాతలు మీడియాకు వెల్లడించారు.
ప్రస్తుత తరానికి అవసరమైన కుటుంబ భావోద్వేగాలు, మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు త్రినాథరావు నక్కిన తెలిపారు. కథలోని సహజత్వం దెబ్బతినకుండా అనకాపల్లిలోని దాదాపు 75 యథార్థ లొకేషన్లలో చిత్రీకరణ పూర్తి చేసినట్లు నిర్మాత కాండ్రేగుల నాయుడు పేర్కొన్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, దేవ్‌జండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారని చెప్పారు.
ఈ చిత్ర డిజిటల్ హక్కులకు సంబంధించి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.


