ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు సినిమా షూటింగ్‌ల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్‌తో ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్ కురుకూరి భరత్ భూషణ్, ఎండీ ఎం.వి. విశ్వనాథన్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, షూటింగ్ అనుమతుల సులభతర ప్రక్రియపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
సినిమా షూటింగ్‌లకు సంబంధించిన అనుమతులు వేగంగా లభించేలా ‘ఫాస్ట్ ట్రాక్’ వేదికగా సింగిల్ విండో విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రతిపాదించారు. అనుమతుల ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరగకుండా, నిర్మాతలు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా సులభతర విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఏపీ ఎఫ్డీసీ ప్రతినిధులు వెల్లడించారు.
త్వరలోనే ఈ నూతన ఫాస్ట్ ట్రాక్, సింగిల్ విండో అనుమతుల విధానాన్ని అధికారికంగా ప్రారంభించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని భరత్ భూషణ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్, అటవీ శాఖ పీసీసీఎఫ్ ప్రమోద్ కుమార్ ఝా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయరామరాజు సహా పలువురు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.


