హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకతో ‘పాంచాలి పంచభర్తృక’ చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం సంయుక్తంగా నిర్మించారు. గంగ సప్తశిఖర దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో దాదాపు 50 మందికి పైగా నటీనటులు అలరించనున్నారని దర్శకుడు గంగ సప్తశిఖర తెలిపారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ, జెమినీ సురేష్‌లతో పాటు రోల్ రిడా, సరీ ఫర్, రాజ్ పవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహేశ్ నారాయణ, బి. షేక్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, కె.వి. ప్రసాద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు.
భారత్‌తో పాటు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్యభరిత చిత్రంగా ఇది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ధీమా వ్యక్తం చేశారు.


