బెంగళూరులో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయం సమీపంలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారి కుమార్తెలను దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగావర ప్రాంతానికి చెందిన ఎస్జీ ఇమ్రాన్ (40) అనే వ్యక్తి ప్రైవేట్ క్యాబ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చే అతిథిని రిసీవ్ చేసుకోవాల్సి ఉందని చెప్పి, తన ఇద్దరు కుమార్తెలు షేక్ జెహ్రా (5), షేక్ జోయా (10)లతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్లోని నాలుగో అంతస్తులో గదిని అద్దెకు తీసుకున్నాడు. సోమవారం ఉదయం చెక్ అవుట్ చేస్తానని హోటల్ సిబ్బందికి తెలిపాడు.
సమయానికి చెక్ అవుట్ చేయకపోవడంతో..
ఉదయం దాటినా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది మధ్యాహ్నం, సాయంత్రం తలుపు తట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో డ్యూటీ మేనేజర్ డూప్లికేట్ మాస్టర్ కీ సాయంతో తలుపులు తెరిచారు.
గదిలో ఇద్దరు పిల్లలు మంచం పక్కన మృతి చెంది పడి ఉండగా, ఇమ్రాన్ గొంతు కోసుకుని సోఫా వద్ద స్పృహతప్పి పడి ఉన్నాడు. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర గాయపడిన ఇమ్రాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, పిల్లలిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇమ్రాన్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
సూసైడ్ నోట్ లభ్యం
సంఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య ప్రవర్తన పై మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇమ్రాన్ అందులో రాశాడని నార్త్ ఈస్ట్ డివిజన్ డీసీపీ మిథున్ కుమార్ తెలిపారు. “నా భార్య ప్రవర్తన వల్ల తీవ్రంగా బాధపడ్డాను, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే నా కుమార్తెలను నాతో పాటు తీసుకెళ్తున్నాను” అని ఆ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.


