మాస్ మహారాజా రవితేజ తాజాగా ‘ఇరుముడి’ చిత్రంతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.
రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, ఈ సెప్టెంబర్ నుండి ఆమె షూటింగ్‌లో పాల్గొననుందట. మరో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీవిష్ణు పక్కన మాళవికా మోహనన్ రెండవ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల తర్వాత హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది.
కేవలం నాలుగున్నర నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి, 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన నటీనటుల వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


