రాళ్లపాటి బ్రదర్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ 1’ సినిమా షూటింగ్ పూర్తయింది. రాళ్లపాటి చిన్న మస్తాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధీరావత్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
వివాహం విషయంలో నేటి యువత తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, వాటి వల్ల ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా చూసే విధంగా వినోదానికి ప్రాధాన్యమిస్తూ కథను నడిపించినట్లు చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
నవీన్, మౌనిక, రేఖ, ఆశిష్, చేతన్, సన్నీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాఘవేంద్ర బి కొల్లార్, ఎడిటర్‌గా రామారావు వ్యవహరిస్తున్నారు.


