సమీక్ష : మండాడి – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : మండాడి – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Published on Sep 10, 2026 5:04 PM IST

విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సూరి, సుహాస్, రవీంద్ర విజయ్, సత్యరాజ్ తదితరులు
దర్శకత్వం : మతిమారన్ పుగళంది
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్
ఛాయాగ్రహణం : ఎస్ఆర్ కతిర్
కూర్పు : ప్రదీప్ ఇ. రాఘవ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

మతిమారన్ పుగళంది దర్శకత్వంలో సూరి, సుహాస్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా మండాడి. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

సముద్ర తీర ప్రాంతం అయిన కళింగపట్నంలోని మత్స్యకార వర్గాల మధ్య పడవ పందాల నేపథ్యంలో ఈ కథ సాగింది. అక్కడ సట్టా పులి(సుహాస్) ఆధిపత్యం చేస్తూ ఉంటాడు. తన బిజినెస్ కి అడ్డు వచ్చిన వారిని అంతం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. తన ఊరి నుంచి మరో టీమ్ బరిలోకి దిగకుండా పడవ పందాల్లో తన మనుషులే పాల్గొనేలా కుట్రలు చేస్తాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సట్టా పులి అధిపత్యానికి చెక్ పెట్టడానికి ముత్తుకాళి (సూరి) రంగంలోకి దిగుతాడు. పడవ పందాల్లో ఎటువంటి అనుభవం లేని కుర్రాళ్లను తీసుకుని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పడవ పందాల్లో దిగుతాడు. పోటీలో గెలిపించే బాధ్యతను తీసుకుంటాడు. మరి పోటీల్లో ఎవరు నెగ్గారు ?, అసలు వీరిద్దరి మధ్య గతంలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఎందుకు వీరిద్దరు శత్రువులుగా మారారు ?, ఏంజెల్ (మహిమా నంబియార్)తో ముత్తుకాళికి ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు ముత్తుకాళి తాను అనుకున్నది సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :-

ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సాగింది. ముత్తుఖాళి పాత్రలో సూరి పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్ లో సూరి నటన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుహాస్ కూడా తన నటనతో తన యాక్షన్ లో ఫ్రెష్ నెస్ ఉన్న ఫీలింగ్ కలిగించాడు. తన పాత్రలో సుహాస్ బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన మహిమా నంబియార్ కూడా చాలా బాగా నటించింది. సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా తన పాత్రలో జీవించాడు. ఆయన పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. రవీంద్ర విజయ్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో కనిపించిన మరియు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

ఇక సముద్రం నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పడవ పందాల సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్‌. ఆ సన్నివేశాల్లో సూరి నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తానికి సముద్రమంత ప్రమాదం… ఆధిపత్య పోరు, మరోవైపు అంతులేని సముద్ర గర్భంలో దాగున్న ప్రమాదాలు, వీటన్నిటి మధ్య ఆధిపత్యం కోసం ఖాళి – పులి చేసే పోరాటాలు, పగ ప్రతీకారాల నేపథ్యంలో ఈ ‘మండాడి’ బాగానే ఆకట్టుకుంది. ఇక దర్శకుడు ఎమోషనల్ సీన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

ఈ ‘మండాడి’లో కొన్ని కీలక సన్నివేశాలు ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా దర్శకుడు మతిమారన్ పుగళంది రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ.. కొన్ని చోట్ల కథనం స్లోగా సాగడం, అలాగే సినిమాలో కొన్ని చోట్ల రెగ్యులర్ ఎలిమెంట్స్ పెట్టడం వంటి అంశాలు బాగాలేదు. మొత్తమ్మీద మతిమారన్ పుగళంది సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేసి.. మళ్లీ ఎమోషనల్ గా సినిమాని ఎండ్ చేశాడు.

మొత్తానికి ఈ ఎమోషనల్ యాక్షన్ స్టోరీలో కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. మిగిలిన ప్లేలో చాలా సీన్స్ రొటీన్ గానే సాగుతూ కథనంలో ఉత్సుకతను పెంచ లేకపోయాయి.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు బలమైన నేపథ్యం తీసుకున్నా.. అంతే బలంగా కొన్ని చోట్ల స్క్రిప్ట్ రాసుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌ జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ ఎస్ఆర్ కతిర్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

‘మండాడి’ అంటూ మత్స్యకార వర్గాల మధ్య పడవ పందాల నేపథ్యంలో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఆకట్టుకుంది. పడవ పందాల వెనుక ఉన్న కుట్రలు, ఆ కుట్రల కారణంగా జరిగే దారుణాలను చాలా బాగా చూపించారు. అలాగే నటీనటుల నటన, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశంలోని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలను సాగదీయడం, కొన్ని చోట్ల బోరింగ్ ప్లే, స్లో నెరేషన్ వంటి అంశాలు సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు