ఇంటర్వ్యూ : నిర్మాత 88 రామారెడ్డి – ‘రాజా విక్రమార్క’ అంతకు మించి హిట్టవుతుంది

ఇంటర్వ్యూ : నిర్మాత 88 రామారెడ్డి – ‘రాజా విక్రమార్క’ అంతకు మించి హిట్టవుతుంది

Published on Aug 20, 2021 11:10 AM IST

సినిమాలపై ప్యాషన్‌తో గ్రామీణ నేపథ్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన నిర్మాతలు కొందరు ఉన్నారు. ఘనవిజయాలు అందుకున్నారు. ఈ బాటలో వస్తున్న నిర్మాత ’88’ రామారెడ్డి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండతో ఆయన ‘రాజా విక్రమార్క’ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. ఈ శుక్రవారం (ఆగస్టు 20న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ’88’ రామారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవీ…

మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ నుంచి వచ్చారు?

మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి.

మరి బిజినెస్ నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు?

వినోద్ రెడ్డిగారు అని ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆయనది మా ఊరు. సుమారు రెండొందల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని సినిమాలు సొంతంగా విడుదల చేశారు. వినోద్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా తొలి సినిమా.

‘రాజా విక్రమార్క’ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?

సినిమా నిర్మించాలని అనుకుంటున్నప్పుడు… వినోద్ రెడ్డి దగ్గరకు ‘రాజా విక్రమార్క’ కథ వచ్చింది. ఆయనతో పరిచయం ఉండటంతో మాటల మధ్యలో ఈ కథ గురించి చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమా చేయాలని ఉందని చెప్పాను. తర్వాత ఆదిరెడ్డిగారితో కలిసి సినిమా స్టార్ట్ చేశాం. అలా వినోద్ రెడ్డి దగ్గర నుండి మా దగ్గరకు సినిమా వచ్చింది.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

ఇది యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్. ’90 ఎంఎల్’ చేస్తున్నప్పుడు హీరోగారితో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత చేయాలని అనుకున్నాం. ‘చావు కబురు చల్లగా’ తర్వాత వస్తే… బావుంటుందని, ఆ సినిమా తర్వాత మా షూటింగ్ స్టార్ట్ చేశాం. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు శ్రీ సరిపల్లి కాంప్రమైజ్ కాకుండా తీశాడు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువపెట్టి మరీ తీశాం. ‘ఆర్ఎక్స్ 100’కు మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. ఆ విషయంలో నో డౌట్.

కార్తికేయతో వర్క్ ఎలా ఉంది?

చాలా చాలా మంచోడు. ‘ఇలాంటోళ్లు ఉంటారా?’ అనుకున్నాను. నా అంచనాలను మించిపోయారు. అతని గురించి మరో మాట అవసరం లేదు. అంత మంచోడు. నంబర్ వన్ మనిషి.

మరి ఈ సినిమా రిలీజ్క ఎప్పుడు?

కరోనా పరిస్థితులు నియంత్రణలోకి వస్తే… అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాం.

హీరోస్ లో మీకు ఎవరంటే ఇష్టం?

మెగాస్టార్ చిరంజీవిగారు అంటే ఇష్టం. మా సినిమాకు చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకున్నాం. కథ ప్రకారం కుదిరింది కూడా! మా సినిమా ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాం. సినిమాలో చిరంజీవిగారి అభిమానులు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అభిమానులు అందరూ ఈలలు వేస్తూ గోల గోల చేసేలా ఉంటుంది.

మెగాస్టార్ సినిమాలు ఎన్నో చూసి ఉంటారు ఆ అనుభవాలు చెప్పండి..

చూసినవి ఉన్నాయి. చూద్దామని వెళ్లి టికెట్ దొరక్క థియేటర్ ముందు పడిగాపులు కాసిన అనుభవం ఉంది. అది ఎప్పటికీ మర్చిపోలేను. ‘ఇంద్ర’ సినిమా చూడాలని మా ఊరు కొంకుదురు నుండి సైకిల్ వేసుకుని మండపేట వెళ్లాను. (నవ్వుతూ) సైకిల్ పార్క్ చేసి టికెట్ తీసుకుందామని వెళ్లాను. నా దగ్గరకు వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేసేశారు. అభిమానుల మధ్య తోపులాటలో నా చెప్పు పోయింది. ఎలాగైనా సినిమా చూడాలని థియేటర్ దగ్గర వెయిట్ చేసి నెక్స్ట్ షో చూసి ఊరెళ్లా. ఆ రోజుల్లో అభిమానులు పడిన తిప్పలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేవండి! థియేటర్లల దగ్గర కోలాహలం, అభిమానుల సందడి… ఆ రోజులు మళ్లీ రావాలి.

మరి నిర్మాతల్లో ఎవరిని అమితంగా ఇష్టపడతారు?

నాకు మూవీ మొఘల్ డి. రామానాయుడు గారు అంటే ఆదర్శం. ఆయనలా సినిమాలు నిర్మించాలి.

అవును, మీ పేరు ముందు ’88’ అని ఉంటుంది. కారణం ఏమిటి?

డబుల్ ఎయిట్ అని పెట్టుకోవడం వెనుక గల కారణాన్ని ఓ నాలుగు సినిమాల తర్వాత చెబుతా. కొత్త కథలతో మంచి సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఉంటాను. నెక్స్ట్ నిర్మించబోయే సినిమా పనులు మొదలుపెట్టాం.

‘రాజా విక్రమార్క’ తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

‘రాజా విక్రమార్క’ తర్వాత పది కథలు విన్నాను. అందులో రెండు నచ్చాయి. బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. హీరోలకు కథలు వినిపించాం. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏది ముందు ప్రారంభం అవుతుందనేది అన్నీ కుదిరిన తర్వాత వెల్లడిస్తా. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు