ఇంటర్వ్యూ : కల్యాణీ మాలిక్ – ‘చెక్‌’ నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది

ఇంటర్వ్యూ : కల్యాణీ మాలిక్ – ‘చెక్‌’ నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది

Published on Feb 16, 2021 9:02 PM IST

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. ‘ఐతే..’ సినిమా తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి, కల్యాణీ మాలిక్‌ కాంబినేషన్‌ మళ్లీ ‘చెక్‌’ సినిమాకు కుదిరింది. అయితే ఈ సినిమాలోని ఏకైక పాట ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ ప్రోమో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదలైంది. రేపు ఈ పూర్తి పాట విడుదల కానుంది. అలాగే ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌ విలేకరులతో ముచ్చటించారు.

 

‘ఐతే…’ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటితో మళ్లీ సినిమా చేశారు.

చంద్రశేఖర్‌ యేలేటితో మళ్ళీ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని 17 ఏళ్లుగా నేను వెయిట్‌ చేశానని, ‘ఐతే…’ తర్వాత అనుకోని సందర్భాల వలన చందూతో మళ్లీ పని చేయడం కుదరలేదని, అనుకోకుండా ‘చెక్‌’ సినిమాకు కలిసి పని చేశామని కల్యాణీ మాలిక్ అన్నారు. సంగీత దర్శకుడిగా ‘ఐతే…’ నా తొలి సినిమా అని, ఆ తర్వాత ఆంధ్రుడు, అష్టా చమ్మా, అలా మొదలైంది, ఊహలు గుసగుసలాడే లాంటి చాలా మంచి సినిమాలు నా కెరిర్‌లో ఉన్నాయని, అయితే నా కెరీర్‌లో సక్సెస్‌లు, ఫ్లాప్‌లు ఉన్నాయి. బ్లాక్‌బస్టర్‌ అంటూ ఇప్పటివరకు ఏమీ లేదని, నా కెరీర్‌లో ‘చెక్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నానని కల్యాణీ మాలిక్ చెప్పుకొచ్చారు.

 

పాటల కంటే నేపథ్య సంగీతం మీద ఆధారపడిన చిత్రమిది. సంగీత దర్శకుడిగా మీరు ఎలాంటి ఛాలెంజ్‌ ఎదుర్కొన్నారు?

‘ఐతే…’లో ఒకే ఒక్క పాట ఉంటుందని, ‘చెక్‌’లో కూడా ఒకే పాట ఉందని అది బుధవారం విడుదలవుతుందని, పాటతో సంబంధం లేకుండా చందూ ఎంచుకున్న యునీక్‌ సబ్జెక్ట్‌ ఆ జైలు వాతావరణం, నితిన్‌ నటించిన విధానం, స్క్రీన్ ప్లేలో పట్టుగానీ చాలా కొత్తగా ఉంటుందని అన్నారు.‘చెక్‌’లో చాలా థ్రిల్లింగ్‌ ఫ్యాక్టర్లు ఉన్నాయని, ఫైట్‌ సీక్వెన్సులు గానీ, ఫైట్లు వచ్చిన విధానం గానీ బావుంటుంది. ఇటువంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సబ్జెక్ట్‌ను చందూ డీల్‌ చేయడం నాకు తెలిసి ఇదే తొలిసారి అని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్‌ అవుతారని కల్యాణీ మాలిక్ అన్నారు.

 

చెక్ సినిమాలో ఒక్క పాటే ఉందన్నారు. ఈ సినిమా ఎంచుకోవడానికి గల కారణం?

నేను ఎంపిక చేసుకొనే స్థితిలో లేనని, వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఒక్క పాట ఉంటే ఛాలెంజింగ్‌ పార్ట్‌ ఎక్కువ ఉంటుందని, ఐదు పాటలు ఉంటే ఈ పాట కాకపోతే మరో పాట బాగా చేయవచ్చని ఎస్కేప్‌ అవ్వొచ్చు. ఒక్క పాట ఉంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలని అన్నారు.

 

ఒక్క పాటకు కథలో సందర్భం ఉందా?

ఖచ్చితంగా ఈ పాటకు కథలో సందర్భం ఉందని, ఇది కావాలని పెట్టిన పాట కాదని ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ రొమాంటిక్‌ సాంగ్‌. కథలో భాగంగానే పెట్టామని అన్నారు.

 

మరో పాట చేయవచ్చు.. ఈ సందర్భంలో పాట వస్తే బావుంటుందని మీరు ఏమైనా సలహా ఇచ్చారా?

అలాగా ఏమీ ఇవ్వలేదని, కథ పూర్తైన తర్వాతే నా దగ్గరకు వచ్చిందని అన్నారు. మరో పాట పెట్టడానికి చందూకి ఎక్కడా స్కోప్‌ దొరకలేదని, రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అదే అనిపిస్తుందని అన్నారు. ఇటువంటి స్క్రీన్ ప్లే బేస్డ్‌ మూవీకి మరో పాట పెట్టకపోవడం మంచిదని అన్నారు. నా ట్యూన్లు చాలా తొందరగా ఓకే అవుతాయని కానీ ఈ సినిమాకి టైమ్‌ పట్టిందని ఆ ఒక్క పాటకు 75 ట్యూన్లు ఇచ్చానని అందుకు 25 రోజులు పట్టిందని కల్యాణీ మాలిక్ అన్నారు.

 

ఇటువంటి సినిమాలకు నేపథ్య సంగీతం ఇంపార్టెంట్‌. మీరు ఎటువంటి వర్క్‌ చేశారు?

నా కెరీర్‌లో ఎక్కువ రోజులు నేపథ్య సంగీతం చేసిన సినిమా ‘చెక్‌’. మొత్తం 30 రోజులు పట్టిందని, కొన్ని రోజులు రాత్రిపూట విరామం తీసుకోకుండా చేశామని అన్నారు. ‘చెక్‌’ నేపథ్య సంగీతానికి నాకు విపరీతమైన పేరు వస్తుందని, ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఎంత ఉపయోగపడిందనేది ప్రేక్షకులు గమనిస్తారని, చందూ డైరెక్షన్‌, నితిన్‌ బాగా యాక్ట్‌ చేయడం వలనే నేను మంచి నేపథ్య సంగీతం చేయగలిగా. నాకు పేరు వస్తే ఆ క్రెడిట్‌ డైరెక్టర్‌, ఆర్టిస్టులదే.

 

నితిన్‌తో మీరు ఫస్ట్‌ టైమ్‌ చేశారు. ఆయన నుంచి మీకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది?

నితిన్‌ చాలా సపోర్టివ్‌, స్పోర్టివ్‌. వెరీ సాప్ట్‌ మరియు షై పర్సన్‌ అని సాధారణంగా ఆయన తక్కువ మాట్లాడతారు. ఆ మాటల్లో ఎంతో ప్రేమ ఉంటుందని, మా కాంబినేషన్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా, సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం ఉంది.

 

‘ఐతే…’కి, ఇప్పటికీ చంద్రశేఖర్‌ యేలేటిలో మీరు ఎలాంటి మార్పు గమనించారు?

ఇంతకు ముందు చందూ క్లోజ్డ్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఓపెన్‌ అయ్యాడు. సలహాలు ఇస్తే చాలా పాజిటివ్‌గా, ఓపెన్‌ మైండ్‌తో రిసీవ్‌ చేసుకుంటున్నాడని, ఎడిటింగ్‌, డబ్బిండ్‌, రీ–రికార్డింగ్‌లో తను ఇచ్చిన ఫ్రీడమ్‌ అంతా ఇంతా కాదని ఆయనలో చాలా మార్పు గమనించానని తనతోనూ ఆ మాట చెప్పానని కల్యాణీ మాలిక్ అన్నారు.

 

మీరు మంచి గాయకుడు. ఇతర దర్శకులు మిమ్మల్ని పాడమని ఎప్పుడు అడగలేదా?

నాకు పాటలు అంటే చాలా ఇష్టమని, చాలామందిని నేనే అడుగుతుంటా. ఫోనులు చేస్తా. మెసేజ్‌లు పెడతా. రీసెంట్‌గా కల్యాణ్‌ ధేవ్‌ ‘సూపర్‌ మచ్చి’లో తమన్‌ నాతో పాట పాడించారని, కొత్త ట్యూన్‌లో నా వాయిస్‌ వింటే కొత్తగా అనిపించింది.

 

సంగీత దర్శకుడిగా మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్ ఏమిటి‌?

ఇప్పటికే రెండు వెబ్‌ సిరీస్‌లు స్టార్ట్‌ అయ్యాయి, సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని కల్యాణీ మాలిక్ అన్నారు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు