ప్రత్యేక ఇంటర్వ్యూ : వీరభద్రం చౌదరి – నాగార్జునలో ఎవరికీ తెలియని ఓ యాంగిల్ ఉంది.

ప్రత్యేక ఇంటర్వ్యూ : వీరభద్రం చౌదరి – నాగార్జునలో ఎవరికీ తెలియని ఓ యాంగిల్ ఉంది.

Published on Oct 22, 2013 4:30 AM IST

Veerabhadram-(13)
మాస్, కామెడీ కలగలిపిన సినిమాలను బాగా డీల్ చెయ్యగలిగిన డైరెక్టర్ వీరభద్రం చౌదరి – ‘ఆహానా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆధ్యంతం నవ్వించారు. రెండు విజయాలు అందుకున్న వీరభద్రం హ్యాట్రిక్ అందుకునే ప్రయత్నంగా కింగ్ అక్కినేని నాగార్జునతో ‘భాయ్’ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్, పాటలు, భాయ్ బుల్లెట్స్ తో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను, తన భవిష్యత్ ప్రణాలికలు తెలుసుకోవడానికి వీరభద్రంతో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మీరు పబ్లిక్ గా ఎన్నో సార్లు నాగార్జున పట్ల మీకున్న అభిమానాన్ని చూపించి ఆయన్ని ప్రశంశించారు. ఒక అభిమానిగా ఈ సినిమా తెరకెక్కిన విధానంలో మీరు హ్యాపీగా ఉన్నారా?

స) కచ్చితంగా.. పూలరంగడు సక్సెస్ తర్వాత నన్ను నమ్మి బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో నాగార్జున గారు. దాంతో నేను ఈ సినిమాని ఎంతో ఫాషన్ తో, ఎంతో పట్టుదలతో తీశాను. నాగార్జున గారు ఈ సినిమా బాగా రిచ్ గా రావడం కోసం పెద్ద అమౌంట్ నే ఖర్చు పెట్టారు. ‘భాయ్’ నాగార్జున ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది.

ప్రశ్న) మీరు నాగార్జునని ఎలా ఒప్పించారు?

స) కొత్త విషయాలని, కాన్సెప్ట్ లని ట్రై చెయ్యడంలో నాగార్జున గారు ఎప్పుడు ముందుంటారని మనకి తెలుసు. ఆయనకి కథ నచ్చితే కొత్త వాళ్లకి చాన్స్ ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకాడరు. అలాగే డైరెక్టర్ పెద్దవాడా/చిన్నవాడా అనే విషయాలను అసలు పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఏదన్నా కొత్తగా ట్రై చేసారు అంటే నాగార్జున తప్ప ఇంకెవరు చేసుంటారు. నేను సాయిబాబా భక్తుణ్ణి. నేను ‘భాయ్’ సినిమా కథని చెప్పడానికి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ‘శిరిడి సాయి’ సినిమా షూటింగ్ లో బాబా గెటప్ లో ఉన్నారు. అప్పుడే నేను ఆయనతో కచ్చితంగా పనిచేయబోతున్నానని అనిపించింది.

ప్రశ్న) ఆడియో ఆల్బం మరియు టీజర్స్ తో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది, అలాగే అంచనాలు పెరిగిపోతున్నాయి. అదేమీ పెద్ద సమస్యగా అనిపించడం లేదా?

స) లేదండి. స్టార్ హీరోకి భారీ అంచనాలు ఉండడం మంచిదే. దానివల్ల మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే సినిమాలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మరియు సినిమా చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చెయ్యడం వల్ల ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారు. నాగార్జున – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వచ్చాయి.

ప్రశ్న) దేవీశ్రీ ప్రసాద్ కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్. దేవీశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి తీసుకోవాలన్నది ఎవరి నిర్ణయం?

స) అది నా నిర్ణయమే. ఒకసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసాక నాగార్జున గారు ఎక్కువగా జోక్యం చేసుకోరు. డైరెక్టర్ కి పూర్తి ఫ్రీడం ఇస్తారు. నేను దేవీశ్రీ అన్నప్పుడు నాగార్జున గారు ఒక్కమాట కూడా అనకపోగా ఎంకరేజ్ చేసారు. నేను తీసుకున్న నిర్ణయం వృధా కాలేదు. దేవీశ్రీ మ్యూజిక్ ఈ సినిమాలో ఓ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) షూటింగ్ జరిగేటప్పుడు జరిగిన ఆసక్తికరమైన లేదా మరిచిపోలేని సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?

స) ఈ సినిమాకి హీరో, నిర్మాత నాగార్జున గారే కావడం వల్ల డైరెక్టర్ కి తన పని కాస్త కష్టమవుతుంది. ఎంతో పరిశీలనగా అన్నీ గమనిస్తుంటారు కాబట్టి తప్పు అనేదానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే నేను చాలా అప్రమత్తంగా ఉండాలి. సినిమా షూటింగ్ మొదలైన కొత్తలో కాస్త టెన్షన్ గా ఉండేది. బ్యాంకాక్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ అయ్యాక నాగార్జున గారితో కాస్త సమయం గడిపేవాన్ని, ఆ సమయంలో ఇద్దరం బాగా కలిసిపోయాం. ఈవివి సత్యనారాయణ గారు మా గురువు, నాగార్జున గారు ఈవివి గారితో ఉన్న బంధం గురించి గుర్తు చేసుకునేవారు. ఆ సందర్భాలను మర్చిపోలేను.

ప్రశ్న) ఎవ్వరికి తెలియనిది నాగార్జున గారి గురించి ఏమన్నా చెప్పండి?

స) నాగార్జున గారు ఎంతో కేర్ తీసుకునే వ్యక్తి, తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఎంతో కేర్ తీసుకుంటారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోలోని స్టాఫ్ ని ఎలా చూస్తారు అన్నది నేను ప్రత్యక్షంగా చూసాను. కార్పోరేట్ తరహాలో ఆయన స్టూడియోని నిర్మించడంతో ఆయన ఉద్యోగులు అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. తన స్టాఫ్ మెంబర్స్ లోని కొంతమంది పిల్లల చదువులకి అయ్యే ఫండ్స్ ని నాగార్జున గారు ఇస్తారు. ఇది ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాల్ని పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ అలాంటి సంఘటనలను నా కళ్ళారా చూసాను. నాగార్జున గారిలోని ఈ యాంగిల్ చాలా మందికి తెలియదు.

ప్రశ్న) వీరభద్రం గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పండి?

స) (నవ్వుతూ) నేను చాలా పాజిటివ్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని. నేను వేరే వాళ్ళ విషయాల్లో అసలు తలదూర్చను. ఎవరన్నా నన్ను ఎక్కువగా విమర్శించినా, ఎక్కువగా బాధపడను ఎందుకంటే వారు చేసిన పనే వారికి రిజల్ట్ చూపిస్తుందని అనుకుంటాను. కానీ సెట్స్ లో మాత్రం డిఫరెంట్ గా ఉంటాను, సెట్లో ఏదన్నా తప్పుగా జరుగుతోందని తెలిస్తే అప్పుడు వీరభద్రంలోని ఇంకో యాంగిల్ బయటకి వస్తుంది(నవ్వులు).

ప్రశ్న) మీ ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వాళ్ళేం చేస్తుంటారు?

స) మా నాన్న గారు ఒక రైతు. నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వారు కూడా వ్యయసాయమే చేస్తుంటారు. మా ఫ్యామిలీలో నేనొక్కడినే గ్రాడ్యువేట్. నేను ఎంసిఎ కోర్స్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. చివరికి నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తి వల్ల సినిమా రంగంలో సెటిల్ అయ్యాను.

ప్రశ్న) ‘భాయ్’ బుల్లెట్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ ఆలోచన ఎవరిది?

స) భాయ్ బుల్లెట్స్ కోసం మేము 5- 6 నెలలు కష్టపడి పనిచేశాం. అవి ఈ సినిమాకి హైలైట్ అవుతాయి. ప్రస్తుతం మూవీ సక్సెస్ కి వన్ లైన్ డైలాగ్స్ మరియు సూదిలా గుచ్చుకునే షార్ప్ డైలాగ్స్ అవసరం. ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ డైలాగ్స్ కోసం మేము చాలా హోంవర్క్ చేసాము. ఈ విషయంలో కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసాను. మంచి రెస్పాన్స్ రావడంతో మేము హ్యాపీ గా ఉన్నాం.

ప్రశ్న) మీరు మరోసారి నాగార్జునలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని బయటకి తీసుకొచ్చినట్టున్నారు..

స) నాగార్జున గారిలో టెర్రిఫిక్ ఎంటర్టైనర్ ఉన్నారు. అలాగే ఆయనకి మంచి టైమింగ్ ఉంది, దాన్ని నేను ఈ సినిమాలో పూర్తిగా ఉపయోగించుకున్నాను. నా గురువు ఈవివి సత్యనారాయణ గారు ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జునని బాగా చూపించారు. మరోసారి నాగార్జునలో ఆ యాంగిల్ చూపిద్దామని ట్రై చేసాను.

ప్రశ్న) వేరే వాళ్ళతో పోల్చుకుంటే రిచా కరెక్ట్ చాయిస్ కాదనేది చాలా మంది భావన. మీరేమంటారు?

స) నేను ఒప్పుకోను.. ఒక్కసారి మీరు ఈ సినిమా చూస్తే ఈ పాత్ర కోసం రిచాని ఎందుకు తీసుకున్నామా అనేది మీకు అర్థమవుతుంది. రిచా చూడటానికి బాగుంటుంది. నాగార్జున నుంచి కూడా ఆమె కాంప్లిమెంట్స్ అందుకుంది. హీరోయిన్ ని ప్రెజెంట్ చేయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. డైరెక్టర్ తన పని పర్ఫెక్ట్ గా చేస్తే సినిమాలో హీరోయిన్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది.

ప్రశ్న) భాయ్ నుండి అభిమానులు ఏమేమి ఆశించవచ్చు?

స) భాయ్ పూర్తి మాస్ ఎంటర్టైనర్. సినిమా చాలా రిచ్ గా ఉంటుంది, అదే టైంలో పూర్తి హాస్య భరితంగా కూడా ఉంటుంది. దీనిలో ప్రేక్షకులకి బాగా పరిచయమున్న చాలామంది నటీనటులు నటించారు. అందరూ చాలా బాగా చేసారు. కుటుంబసమేతంగా థియేటర్ కి వచ్చి బాగా నవ్వుకోవచ్చు. కామెడీ మరియు యాక్షన్ సీక్వెన్ లను పక్కన పెడితే సినిమాలో మంచి సెంటిమెంట్ కూడా ఉంటుంది.

ప్రశ్న) మీరు తదుపరి చేయనున్న సినిమాలేమిటి?

స) నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడిన ఓ రొమాటిక్ ఫిల్మ్ చెయ్యాలనుకుంటున్నాను. అలాగే నాకు కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. ‘భాయ్’ రిలీజ్ అయిన తర్వాత నా తదుపరి చిత్రాల గురించి అనౌన్స్ చేస్తాను.

ప్రశ్న) మా పాఠకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) థియేటర్స్ లో ‘భాయ్ ‘ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చెయ్యండి. పైరసీని ప్రోత్సహించద్దు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. మీరు కూడా ఈ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.

అంతటితో వీరభద్రం చౌదరికి భాయ్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పి, మా ఇంటర్వ్యూని ముగించాం..

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు