ఇంటర్వ్యూ : వారిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను – శ్రీనివాస్ రెడ్డి

ఇంటర్వ్యూ : వారిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను – శ్రీనివాస్ రెడ్డి

Published on Nov 27, 2012 2:00 AM IST


కామెడీ చిత్రాలు చేసే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మూడేళ్ళలో 5 సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ఆయన గత మూడేళ్ళలో కేవలం ఒక్క సినిమా మత్రమే తీసాడు. 5 సినిమాలకు వచ్చే పేరు ఢమరుకం సినిమాకి వచ్చింది అంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి. నాగార్జున, అనుష్క, రవిశంకర్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఢమరుకం సినిమా గత శుక్రవారం విడుదలైంది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమా గురించి చెప్పిన ముచ్చట్లు మీకోసం.

1) ప్ర : ఢమరుకం సినిమాకి ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తోంది?
స : ఢమరుకం నాగార్జున గారి కెరీర్లోనే మొదటి సోషియో ఫాంటసీ సినిమా. అదే విధంగా ఆయన కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా కూడా ఇది. నిన్న మార్నింగ్ షో నుండి అందరు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. నాగార్జున గారి కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి. కొన్ని ఏరియాలలో డబుల్ థియేటర్స్ కూడా వేసారు. అన్ని ఏరియాల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.

2) ప్ర : ఈ సినిమా విజయానికి కారకులు ఎవరు?
స : ఒక్కరు అని చెప్పలేను. ఢమరుకం టీం అంతా కష్టపడ్డాం. అందకు తగ్గ ప్రతిఫలం ఈ రోజు ప్రేక్షకుల స్పందన రూపంలో చూస్తున్నాము. దేవిశ్రీ ప్రసాద్ అందించిన 10 పాటల్లో అన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు అందించాడు. ఆడియో విడుదలైన రోజే సగం సినిమా హిట్ అయింది అనుకున్నాం. 40 రోజులు కష్టపడి అందించిన నేపధ్య సంగీతం అయితే అధ్బుతం. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ, ఫైర్ ఫ్లై గ్రాఫిక్స్ రెండు ఈ సినిమాకి మెయిన్ హైలెట్స్.

3) ప్ర : విడుదలకు ముందే అక్కినేని కుటుంబ సభ్యులు ఈ సినిమాని చూసారు కదా వారి స్పందన ఎలా ఉంది?
స : అక్కినేని నాగేశ్వర రావు గారు సినిమా చూసి బయటికి రాగానే దగ్గరికి పిలిచి పాతాల భైరవి స్థాయిలో తీసావు అని మెచ్చుకున్నారు. నాగార్జున గారు అయితే వెంటనే నాగ చైతన్యతో నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు.

4) విడుదల విషయంలో జాప్యం జరిగింది కదా? దాని వల్ల సినిమాకి ఏమైనా నష్టం జరిగిందా?
స : సమస్యలు అనేవి ఎవరికైనా వస్తాయి. 40 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కావడంతో మా సినిమాకి కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. దాని వల్ల రెండు, మూడు సార్లు విడుదల తేదీ ప్రకటించడం వాయిదా పడడం జరిగింది. ఇదంతా శివుడి లీలే అనుకున్నాం. కార్తీక మాసం మొదటి సోమవారం రోజు విడుదల ప్రకటించి విడుదల చేసాం. చుసిన వారందరూ కార్తీకమాసంలో శివుడి దర్శనం చేసుకున్నట్లే జరిగిందని అంటున్నారు. ముందు ప్రకటించిన తేదీ కంటే ఎక్కువ ప్రమోట్ అయి ఇంత భారీ ఓపెనింగ్స్ రావడానికి హెల్ప్ అయింది.

5) ప్ర : ఈ సినిమాలో హీరోగా నాగార్జునని ఎలా ఒప్పించారు?
స : ముందుగా వెంకట్ గారికి రెండు కథలు వినిపించాను. ఒకటి వరంగల్ నేపధ్యంలో సాగే కథ కాగా మరొకటి ఇది. ఆయన నన్ను నాగార్జున గారి దగ్గరికి పంపించి కథ వినిపించామన్నారు. ఆయనకు ఢమరుకం కథ బాగా నచ్చి ఇది చేద్దాం అన్నారు. నిర్మాత, హీరో ఇద్దరూ నన్ను నమ్మి ఇంత భారీ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. వారికి న జన్మంతా రుణపడి ఉంటాను. క్లైమాక్స్ దాదాపు 15 రోజులు షూట్ చేసాం. నాగార్జున గారు ఎంతో సహకరించారు.

6) ప్ర : మిగతా నటీ నటుల సహకారం ఎలా ఉంది?
స : అనుష్క ఒక మంచి పాత్ర చేసింది. అరుంధతి తరువాత ఒక మంచి పాత్ర చేసిందని అందరి నుండి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే బొమ్మాలి రవిశంకర్ అయితే అధ్బుతమైన నటన అని చెబుతున్నారు అందరూ. డబ్బింగ్ అరిస్ట్ గా అతనికి చాల పెద్ద పేరు ఉంది. ఈ సినిమా తరువాత అతనికి నటుడిగా చాలా అవకాశాలు వస్తాయి. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, గణేష్ వెంకట్రామన్ ఇలా అందరి సహకారం వల్లే ఒక మంచి సినిమా తీయగలిగాను.

7) ప్ర: ప్రకాష్ రాజ్ శివుడి పాత్రకి సరిపోలేదని విమర్శలు వస్తున్నాయి కదా మీరేమంటారు?
స : అందరి అభిప్రాయాలూ ఒకలా ఉండవు కదా. నాకైతే చాల మంది ప్రకాష్ రాజ్ శివుడిగా సరిగ్గా కుదిరాడు అన్నారు. కొందరు గెటప్ కుదరలేదు అన్నారు.

8) ప్ర : నాగ చైతన్య సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది?
స : ఇంకా కథ ఏమీ అనుకోలేదు. ప్రస్తుతం ఢమరుకం ప్రమోషన్లో బిజీగా ఉన్నాను. ఇది పూర్తయిన తరువాత స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను.

9) ఇక మీదట ఎలాంటి సినిమాలు చేస్తారు?
స : నాకు ఇవివి సత్యనారాయణ గారంటే చాలా ఇష్టం. దాసరి నారాయణరావు గారి తరువాత అన్ని సినిమాలు చేయగలిగిన దర్శకుడు ఇవివి గారే. ఆయన ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే ఆమె, అల్లుడా మజాకా, నేటి గాంధీ ఇలా అన్ని రకాల సినిమాలు చేసారు. ఆయన లాగా అన్ని సినిమాలు చేయాలని ఉంది.

శ్రీనివాస్ రెడ్డి మరిన్ని సినిమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం.

అశోక్ రెడ్డి .ఎమ్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు