ముఖాముఖి : నన్ను శ్రేయ అని పిలవొద్దు: శ్రియ

ముఖాముఖి : నన్ను శ్రేయ అని పిలవొద్దు: శ్రియ

Published on Mar 20, 2012 2:40 PM IST

అల్లరి నరేష్, శర్వానంద్ మరియు శ్రియ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు నారాయణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘నువ్వా నేనా’. గత శుక్రవారం ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని ఫిలిం చాంబర్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ చిత్ర హీరొయిన్ శ్రియ విలేఖరులతో ముచ్చటించారు.

 

ప్ర: ఈ చిత్రంలో ఇద్దరు హీరోలతో కలిసి పనిచేసారు. ఇద్దరిలో ఎవరు ఎవరు బాగా చేసారు? వారితో పనిచేయడం ఎలా అనిపించింది?
స: ఇద్దరు చాలా బాగా నటించారు. కామెడీ పండించడంలో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన గత సినిమాలే చెబుతాయి.ఇక శర్వానంద్ విషయానికి వస్తే మంచి నటుడు గత సినిమాల్లో నిరూపించుకున్నాడు. ఇద్దరు ఈ సినిమాలో బాగా చేసారు. అలాగే బ్రహ్మానందం గారు మరియు అలీతో పనిచేయడం ఆనందంగా ఉంది.

 

ప్ర: నువ్వా నేనా సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు?
స: మంచి కామెడీ సినిమా అని చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు. పాప్ కార్న్ కామెడీ సినిమా అని అందరూ ఫోన్ చేసి చెబుతున్నారు. నరేష్, శర్వానంద్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. చాలా రోజుల తరువాత ఒక మంచి కామెడీ సినిమా చూసామని అందరూ ఫీలవుతున్నారు.

 

ప్ర: ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘దీవానా మస్తానా’ సినిమాని పోలి ఉంది. ఆ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా?
స: అవును. ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మాట వాస్తవమే కాని ఈ సినిమాలో ట్రీట్ మెంట్ మాత్రం వేరేవిధంగా ఉంది. ఓపెన్ మైండ్ తో ఈ సినిమా చుడండి మీకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో నేను నందిని అనే డాక్టర్ పాత్ర పోషించాను. గతంలో సంతోషం సినిమాలో కూడా డాక్టర్ పాత్ర చేశాను కాని ఇందులో నా పాత్ర పూర్తి వినోదంగా ఉంటుంది.

 

ప్ర: మీకు ఎలాంటి పాత్రలంటే ఇష్టం?
స: రొమాంటిక్ కామెడీ పాత్రలంటే ఇష్టం. దాదాపు తెలుగులో ఉండే అందరి హీరోలతో నటించాను. ఇప్పటి వరకు ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో, రొమాంటిక్ సినిమాల్లో నటించాను కాని కామెడీ పాత్ర చేయలేదు. ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరింది.

 

ప్ర: దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో 10 సంవత్సరాలుగా నటిస్తున్నారు. ఇప్పటికీ సరిగా తెలుగు మాట్లాడలేకపోతున్నారు. కారణం ఏంటి?
స: నేను తెలుగు మాట్లాడానికి ప్రయత్నిస్తుంటాను కాని నాతో అందరు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతుంటారు. నాకు కూడా తెలుగులో మాట్లాడాలని ఉంటుంది. వేరే వాళ్ళు తెలుగు మాట్లాడితే అర్ధమవుతుంది కాని మాట్లాడటం కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటికీ నా పేరు చాలా మంది శ్రేయ అని అనుకుంటున్నారు. నా పేరు శ్రేయ కాదు శ్రియ అని చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది.

 

ప్ర: ఈ సినిమాలో మీకు నచ్చిన పాటలు ఏమిటి?
స: ముఖ్యంగా బ్లాక్ బెర్రీ పాట నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఈ పాటని బాగా ఫన్నీగా చిత్రీకరించారు. అలాగే ‘నీలి నీలి కన్నులే’ పాట అంటే బాగా ఇష్టం. సంగీత దర్శకుడు భీమ్స్ కి మొదటి చిత్రమే అయినా చాలా మంచి పాటలు ఇచ్చారు.

 

ప్ర: మీరు భవిష్యత్తులో చేయబోయే సినిమాలు ఏమిటి?
స: దీపా మెహతా డైరెక్షన్లో ‘మిడ్ నైట్ డ్రీమ్స్’ అనే సినిమాలో నటిస్తున్నాను. శ్రీలంక, బంగ్లాదేశ్, ముంబై వంటి నగరాల్లోని మురికి వాడ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల అవుతుంది. ఇదే కాకుండా తెలుగులో కూడా ఒక సినిమా చేస్తున్నాను. ఆ చిత్ర దర్శకుడి మీద అభిమానం, గౌరవంతో ఆ ప్రాజెక్టు వివరాలు చెప్పలేకపోతున్నాను. త్వరలో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు