ఇంటర్వ్యూ : తాప్సీ – ‘గంగ’లో ఆ సీన్ ఎప్పటికీ మరచిపోలేను!

ఇంటర్వ్యూ : తాప్సీ – ‘గంగ’లో ఆ సీన్ ఎప్పటికీ మరచిపోలేను!

Published on May 9, 2015 4:32 PM IST

Tapsee-
తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీ ఆ తర్వాత వరుసగా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తాజాగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ముని సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కిన సినిమా గంగ(కాంచన 2)లో హీరోయిన్‌గా నటించింది తాప్సీ. గత వారమే విడుదలైన ఈ సినిమా సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా తాప్సీతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) హలో అండీ. ‘గంగ’ విజయం ఎలాంటి ఉత్సాహానిచ్చింది?

స) ‘గంగ’ సినిమా ఇంత మంచి విజయం సాధించడం అద్భుతంగా ఉందడీ. ఈ సక్సెస్ నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఐదేళ్ళ నా కెరీర్‌లో ఏ సినిమాకూ రానంత గుర్తింపు ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం మొదట్నుంచే ఉన్నాకూడా ఇలా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. దాని గురించి చెప్పండి?

స) ప్రతీ ఒక్కరూ తాప్సీ అద్భుతంగా నటించింది అంటుంటే నా రెండేళ్ళ కష్టాన్ని ఇట్టే మరిచిపోయా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఈ ఐదేళ్ళ ప్రయాణంలోనే చాలా నేర్చుకున్నా. అదంతా ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఇలాంటి చాలెంజింగ్ రోల్ నాకు దక్కడం నిజంగా నా అదృష్టం. కమర్షియల్ సినిమాల్లో ఓ హీరోయిన్‌కు చాలా తక్కువ సమయాల్లో నటించడానికి స్కోప్ ఉన్న బలమైన పాత్ర దొరుకుతుంది. ఆవిధంగా చూసుకుంటే.. నేను లక్కీ అనే చెప్పాలి.

ప్రశ్న) ఈ సినిమా ద్వారా కొత్తగా ఏం నేర్చుకున్నారు?

స) ‘బేబీ’ సినిమాకు ముందు ఓసారి నా కెరీర్‌ను గుర్తు చేసుకుంటే.. చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే గుర్తుండిపోయే పాత్రలు చేశాననిపించింది. అప్పుడే ఏదైనా చేంజ్ చూపించాలని ఫిక్సయ్యా. అదే సమయంలో బాలీవుడ్‌లో ‘బేబీ’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా దేశవ్యాప్తంగా నాకు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాతే నన్ను నటిగా ఎస్టాబ్లిష్ చేసే సినిమాలను మాత్రమే ఎంచుకోవాలని ఈ ప్రయాణం మొదలుపెట్టా. ‘గంగ’ (కాంచన 2)కు నేను ఊహించనంత క్రేజ్, అభినందనలు వస్తున్నాయి. ఓ నటికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అందుకే ఇకపై కూడా బలమైన పాత్రలనే చేస్తా.

ప్రశ్న) దర్శకుడు లారెన్స్ గురించి చెప్పండి?

స) ఆయన మల్టీ టాస్కింగ్ చూసి ఆశ్చర్యపోయా. ఒకే మనిషి డైరెక్టర్‍గా, యాక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా ఇన్నింటిని ఎలా సమన్వయం చేసుకుంటున్నాడా అని ఆలోచిస్తూండేదాన్ని. అనుకున్నది అనుకున్నట్టుగా చేసేవరకూ ఆయన దాని గురించే ఆలోచిస్తారు. అదే ఆయన సక్సెస్ సీక్రెటేమో!

ప్రశ్న) ఈ సినిమాలో నిత్యామీనన్‍ది ఓ కీ రోల్ కదా. ఆమెను మీకు పోటీగా భావించలేదా?

స) అలా ఎలా ఆలోచిస్తామండీ? సినిమాలో ఇద్దరికీ ఎవరి ప్రాధాన్యత వారికుంది. అయినా మన పాత్రను మనం చేసుకుంటూ పోవడమే మన పని. నిత్యామీనన్ తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమా అనేది ఏ ఒక్కరి మీదో ఆధారపడదు కదా? అందరూ తమ శక్తిమేర కలిస్తేనే ఆ సినిమా విజయం సాధిస్తుంది. అలాంటప్పుడు నిత్యామీనన్‌ నాకు పోటీ అనే ప్రశ్నే అర్థం లేనిది.

ప్రశ్న) ఈ సినిమాలో మీకు చాలెంజింగ్‌ అనిపించిన సీన్ ఏది?

స) చాలా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో నాకు దయ్యం పట్టినప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా కష్టమనిపించాయి. ఒక షాట్‌కైతే ఏకంగా 35టేకులు తీసుకున్నా. నేను చాలెంజింగ్‌గా ఫీలయ్యి చేసిన సీన్ అంటే.. లారెన్స్ దగ్గరకు లంగా ఓణీ కట్టుకొని వచ్చి గంగలా నటించే సీన్ గురించి చెప్పుకోవాలి. ఆ సీన్ ఎప్పటికీ మరచిపోలేను.

ప్రశ్న) మళ్ళీ స్ట్రైట్ తెలుగు సినిమాలో ఎప్పుడు కనిపిస్తున్నారు?

స) నాకూ తెలుగులో ఓ సినిమా చేయాలనే ఉంది. మంచి స్క్రిప్ట్ దొరికితే వెంటనే చేస్తా. అయితే ఒకేరకమైన సినిమా చేయడమంటే నాకూ బోర్ కొడుతుంది. నా పాత్ర ఎంత సేపు ఉంటుందనే విషయం కంటే నటించడానికి ఎంత స్కోప్ ఉందనేదానిపైనే కాన్సంట్రేట్ చేస్తున్నా. ఈ రెండేళ్ళలో నాలో వచ్చిన మార్పేదైనా ఉందంటే.. కొత్త తరహా పాత్రలను ఎన్నుకోవడమనే ఆలోచనే.

ప్రశ్న) మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని వినిపిస్తోంది. అందులో నిజమెంత?

స) ఈ విషయంలో నేను ఎవరికీ సమాధానం చెప్పను. నేనెవరినైనా ప్రేమిస్తే ముందు ఆ విషయం మా అమ్మా నాన్నలకు చెబుతా. అంతకుమించి ఈ విషయంలో బయటివారెవరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు