ఇంటర్వ్యూ: ‘రెడ్’ సినిమాను తక్కువ రేటుకే ఇచ్చాం – స్రవంతి రవికిశోర్

ఇంటర్వ్యూ: ‘రెడ్’ సినిమాను తక్కువ రేటుకే ఇచ్చాం – స్రవంతి రవికిశోర్

Published on Jan 19, 2021 10:10 PM IST

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో రామ్ ‘రెడ్’ కూడ ఒకటి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తీవ్ర పోటీ నడుమ 14వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం గురించి, విశేషాల గురించి చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్ మాటల్లోనే విందాం.

 

* ‘రెడ్’ విజయానికి కంగ్రాట్స్ రవికిశోర్ గారు.

థ్యాంక్యూ. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని, వసూళ్ల వస్తాయని ముందునుంచీ నమ్మకం ఉంది. థియేటర్లలో సినిమా చూసి బావుందని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది.

 

* సినిమా లాభాల్లోకి వచ్చినట్టుంది.

అవును. ఫస్ట్ డే సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండవ రోజు రూ. 4.17 కోట్లు, మూడవ రోజు రూ. 2.71 కోట్లు, నాల్గవ రోజు రూ. 2.26 కోట్ల షేర్‌ వచ్చింది. కొన్ని మేజర్ ఏరియాల్లో మేమే విడుదలచేసినప్పటికీ మిగతా ఏరియాల్లో చాలా రీజనబుల్‌ రేటుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం. కరోనా నష్టానికి తోడు 50 శాతం ఆక్యుపెన్సీని దృష్టిలో పెట్టుకుని మామూలు రేటు కంటే తక్కువ రేటుకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేశాయి. తక్కువ రేటుకు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది ఏమీ జరగలేదు. మా లాభాల్లో కొంత తగ్గింది అంతే. నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి ఎదుర్కొనాలనేది నా అభిమతం. కరోనా సమయంలోనూ… ఓ రేటుకు సినిమాను అమ్మడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బు కొన్నిచోట్ల రెండో రోజు, కొన్నిచోట్ల మూడవ రోజే తిరిగి వచ్చేసింది. పశ్చిమ గోదావరిలో 2వ రోజుకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తూర్పు గోదావరిలో మూడో రోజు బ్రేక్‌ ఈవెన్‌ అయింది. నాలుగు రోజులకి అందరూ లాభాలు చూశారు.

 

* ఓటీటీల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని విన్నాం. కరోనా పరిస్థితుల ప్రభావం వలన ఓటీటీకి వెళ్లాలని అనిపించలేదా ?

ఎన్నాళ్లయినా థియేటర్లలోనే సినిమాను విడుదల చేద్దామనే అనుకున్నా. ఓ డిస్ట్రిబ్యూటర్‌ నాతో ‘యాక్టర్లను, హీరోలను స్టార్స్‌ చేసేది వెండితెరే’ అన్నాడు. ఆ మాట నాకు నచ్చింది. హీరోలు
ఇమేజ్‌ పెరిగి ప్రజల మనసుల్లో ఉండాలంటే ప్రేక్షకులు పెద్ద స్ర్కీన్‌ మీదే సినిమా చూడాలి. నా ఉద్దేశంలో థియేటర్‌ కోసం చేసిన సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా ఓటీటీకి ఇవ్వడమనేది కరెక్ట్‌ కాదు. సినిమాపై ప్యాషన్‌ ఉన్నవాళ్లు ఎవరూ అలా చేయరు. నేను పదిరూపాయల పెట్టుబడి పెట్టా. 12 రూపాయలు వస్తే చాలు అనుకునేవాళ్లు వేరు. పది రూపాయలకు తొమ్మిది వచ్చినా, 12 వచ్చినా ప్రేక్షకుడి నుంచే రావాలని నేను ఆలోచిస్తా. ఇటువంటి నిర్మాతలం కొంతమంది ఉన్నాం. సినిమా అంటే ప్యాషన్‌ అని చెప్పినవాళ్లు థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే వాళ్ల మాటలు నమ్మవద్దు.

 

* ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి‌ బ్లాక్‌బస్టర్‌ తర్వాత రామ్‌తో ‘రెడ్‌’ లాంటి థ్రిల్లర్‌ చేయడానికి రీజన్ ?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కంటే ముందే ఈ సినిమా చేద్దామని నేను అనుకున్నా. రామ్‌ చేస్తాడా? లేదా? అనేది అప్పటికి తెలియదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ భయపెట్టిన మాట నిజమే. అంత పెద్ద‌ సక్సెస్‌ తర్వాత ‘రెడ్‌’ చేయడం సబబేనా అని చాలారోజులు డిస్కస్‌ చేసుకున్నాం. ఏ హీరోకైనా నెక్ట్స్‌ సినిమా ఏదైనా అంతకు ముందు సినిమా సక్సెస్‌తో పోలుస్తారు. దీన్ని రామ్‌ ఫేస్ చేయక తప్పదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ‘రెడ్‌’ను పోల్చలేం. కానీ, మంచి చిత్రమిది. ఇందులో యాక్టింగ్‌కి స్కోప్‌ ఉంది. అందుకని, ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ఇప్పటివరకూ రామ్‌ కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. రెండు పాత్రల్లో మంచి నటన కనబరిచాడు. ఆదిత్యతో మాస్‌ ఆడియన్స్‌, సిద్ధార్థ క్యారెక్టర్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చింది.

 

* ‘రెడ్‌’ను మిగతా భాషల్లో విడుదల చేసే ఆలోచన ముందునుంచీ ఉందా ?

మూడు నాలుగేళ్ల నుంచి రామ్‌ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. రామ్‌ చేసిన క్లాస్‌ సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. ‘నేను శైలజ’ను హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కి 300 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ‘ఉన్నది ఒకటే జిందగీ’కి 190 మిలియన్స్‌, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి 271 మిలియన్స్‌, ‘హైపర్‌’కి 120 మిలియన్స్‌, ‘గణేష్‌’కి 100 మిలియన్స్‌, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి 150 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన ఏకైక దక్షిణాది హీరో రామ్.‌ అన్ని భాషల్లో రామ్‌ను ఆదరిస్తున్న అభిమానులకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇది రామ్‌ నేషనల్‌ లెవల్‌ ఎంట్రీ కాదు. ఈ నెల 22న మలయాళంలో ‘రెడ్‌’ విడుదలవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో హిందీలో విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాం.

 

* ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మీ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్‌ ఎమోషనల్‌ అయ్యారు.

అవును. త్రివిక్రమ్ ప్రయాణం మా సంస్థలోనే మొదలైంది. ఎవరూ తమ ప్రయాణాన్ని మర్చిపోరు
నాకు ‘లేడీస్‌ టైలర్‌’ సమయంలో అటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. మా ఇద్దరి అనుబంధం వేరు. సన్నివేశాలు, పాత్రలు, కథల గురించి మాట్లాడుకుంటూ సినిమా మేకింగ్‌ ఎంజాయ్‌ చేశాం. వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా మేకింగ్‌ డేస్‌ అవే అనిపిస్తుంది.

 

* ఇండస్ట్రీలో కాలానుగుణంగా అప్పట్నుంచి ఇప్పటికి మీరు గమనిస్తున్న మార్పులు ఏంటి?

నాలో ఏ మార్పూ లేదు. ఎవరి పద్ధతి వాళ్లది. మిగతావాళ్ల గురించి నేను చెప్పలేను. ఇప్పటికీ ఆఖరి షాట్‌ సహా బౌండ్‌ స్క్రిప్ట్‌ ఉండి కథ తెలిస్తేనే గానీ సినిమా చేయను.

 

*రామ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మీ నిర్మాణ సంస్థలో సినిమా ఏదైనా ప్లాన్‌ చేస్తున్నారా ?

దేనికైనా టైమ్‌ రావాలి. త్రివిక్రమ్‌కి ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉండి ఉంటాయి . తను మనం సినిమా చేద్దాం అంటే ఎప్పుడైనా నేను రెడీ.

 

* మీ తదుపరి సినిమా ఎప్పుడు ?

ఇప్పుడే చెప్పలేను. సినిమా చేసేయాలి కాబట్టి ఏదో ఒకటి చేయను. ఈ కథ చేయాలి అనిపించినప్పుడు చేసేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు