ఇంటర్వ్యూ :- స‌మంత – ‘జాను’గా నా నటన.. నా కెరీర్ లోనే బెస్ట్ !

ఇంటర్వ్యూ :- స‌మంత – ‘జాను’గా నా నటన.. నా కెరీర్ లోనే బెస్ట్ !

Published on Feb 5, 2020 6:05 PM IST

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా ఫిబ్రవరి 7న రాబోతున్న చిత్రం ‘జాను’. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. కాగా ఈ సంధర్భంగా స‌మంత పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

ఈ సినిమాలోని ఏ సీక్వెన్సెస్ షూట్ చేస్తోన్నప్పుడు కష్టంగా అనిపించింది ?

ఈ సినిమా కథ కేవలం రెండు పాత్రల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ మీదే ఆధారపడి ఉంటుంది. పైగా ప్రతి సీన్ ఒక ఫీల్ తో సాగే సినిమా. సాధారణంగా, వేరే చిత్రాలలో పాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు, అలాగే వేరే ట్రాక్స్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో చాల విషయాలు అందుకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఈ చిత్రంలోని చాల భాగం షూట్ కి కష్టమైన టాస్క్ నే. కానీ సినిమాని చాల ఎంజాయ్ చేసి చేశాము.

 

మీరు ఈ రీమేక్‌ మూవీలో నటించాలని నిర్ణయించుకున్న తర్వాత ఒరిజినల్ వర్షన్ లో నటించిన త్రిషను కలిశారా?

లేదు, ఈ సినిమా కోసం నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. కలవాలనుకోలేదు. అయితే నేను ఈ సినిమా చూసినప్పుడు ఆమె నటన నాకు చాల బాగా నచ్చింది. ఆ సమయంలో అందరూ విజయ్ సేతుపతి నటనే సినిమాలో ప్రధాన హైలైట్‌గా మాట్లాడారు గాని, నాకు మాత్రం త్రిష నటనే హైలైట్ అనిపించింది.

 

ఈ చిత్రంలో మీరు నటించడానికి ప్రధానమైన కారణమేమిటి?

ఈ సినిమా కోసం దిల్ రాజు నన్ను అడుగుతారని తెలుసుకున్న తరువాత నేను ఆయనకు కనబడకుండా తప్పించుకుంటూ వచ్చాను. కానీ చివరికీ ఆయనను అయిష్టంగానే కలిసాను. ఎందుకంటే ఆయన నన్ను ఈ సినిమా చేయమని అడిగితే, నేను ఆయనకు నో చెప్పలేను. ఫైనల్ గా ఆయన చేయమని అడిగారు.. నేను కూడా ఈ సినిమాను ఒక ఛాలెంజ్‌ గా తీసుకుని చేశాను.

 

జాను పాత్రకు మీరెంత న్యాయం చేశారని అనుకుంటున్నారు ?

ఈ చిత్రంలో జాను పాత్రలో నేను పూర్తిగా ఇన్ వాల్వ్ అయి చేశాను. నా కెరీర్‌లోనే ఇప్పటివరకు నేను చేసిన ఉత్తమ ప్రదర్శన ఇదేనని నేను భావిస్తున్నాను. రేపు ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను.

 

ఈ చిత్రంలో శర్వానంద్ సహకారం ఎలా అనిపించింది ?

రామ్ పాత్రలో శర్వానంద్ కాకపోయి ఉంటే, ఈ చిత్రం అస్సలు ఇలా వచ్చేదే కాదు. శర్వానంద్ చాల బాగా చేశాడు. బెటర్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ షూట్ చేశాము. మా పాత్రల మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని నేను భావిస్తున్నాను.

 

మీరు గత కొన్ని సినిమాలుగా వరుస విజయాలను అందుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ?

హీరోయిన్ కెరీర్ చాలా చిన్నది. ఉన్న పరిమిత సమయంలోనే ఏ హీరోయిన్ అయినా తనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ డబ్బు కోసం పని చేయలేదు. చాల వరకూ మంచి పాత్రలే చేశాను. ఇప్పుడు దర్శకులు కొన్ని గొప్ప కథలతో నా వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం నా కెరీర్‌లోనే నేను చాలా సంతోషంగా ఉన్న సమయం ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు