యుట్యూబర్ మౌళి తనుజ్ ప్రశాంత్ తన మొదటి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, అనూహ్యమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన ఘన విజయం మౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ తొలి హిట్ తర్వాత పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు ఆయనను వైవిధ్యమైన కథలతో సంప్రదించినప్పటికీ, కథల ఎంపికలో మౌళి ఎంతో జాగ్రత్త వహించారు.
తాజాగా ఆయన నటించబోయే రెండవ చిత్రం అధికారికంగా ఖరారైంది. ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. తెలుగునాట అగ్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీను కంబాల రచన మరియు దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇదొక పూర్తిస్థాయి క్రైమ్ కామెడీ డ్రమాగా తెరకెక్కనుంది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అప్పుడే మంచి అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రంలో మౌళి సరసన సుస్మితా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని సమకూరుస్తుండగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. వినోదానికి ప్రాధాన్యతనిస్తూ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే చిత్రబృందం ప్రకటించనుంది.
