ఇంటర్వ్యూ : నిజార్ షఫీ – ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ !

ఇంటర్వ్యూ : నిజార్ షఫీ – ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ !

Published on Jun 3, 2019 5:21 PM IST

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. జూన్ 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు నిజార్ షఫీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

 

మీరు ఇంతకుముందే హవీష్ తో వర్క్ చేశారా ?

లేదండి. నేను బేసిగ్గా సినిమాటోగ్రఫర్ ని. ‘నేను లోకల్’ ‘మహానుభావుడు’ ‘శైలజారెడ్డి అల్లుడు’ అలాగే కొన్ని తమిళ్ సినిమాలకు కెమెరామెన్ గా చేశాను. డైరెక్టర్ గా సెవెన్ నా ఫస్ట్ మూవీ. అయితే హవీష్ నా వర్క్ చూసి.. ఒక లైన్ ఉంది డైరెక్షన్ చేయమని నన్ను అడిగారు. లైన్ విన్నాను చాలా బాగుంది. ఆ తరువాత ఆ లైన్ మీద వర్క్ చేసి సినిమా చేశాం.

 

మీరు సినిమాటోగ్రఫర్.. మరి హవీష్ గారు డైరెక్షన్ చేయమని మిమ్మల్నే అడగటానికి కారణం ఏమిటి ?

 

ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువుగా ఉంటాయి. అంటే స్క్రిప్ట్ లో విజువల్స్ అండ్ కెమరా వర్క్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన నన్ను డైరెక్షన్ చేయమని అడిగి ఉంటారు.

 

అంటే, డైరెక్షన్ చేయాలని మీకు స్వతహాగా ముందే ఇంట్రస్ట్ ఉందా ?

 

ఉంది. కాకపోతే ఇప్పుడే డైరెక్షన్ చేస్తానని నేను కూడా ఊహించలేదు. భవిష్యత్తులో చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. కానీ అవకాశం ఇప్పుడు వచ్చింది. చేశాను. ఇక డైరెక్టర్ గా ఎక్స్ పీరియన్స్ అంటే నేను ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశాను. అలాగే తమిళంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను.

 

మీరు సినిమాటోగ్రఫర్ గా చేసారు ? ఇప్పుడు డైరెక్టర్ గా చేసారు ? రెండిట్లో మీకు ఏది కష్టమనిపించింది ?

 

కష్టమని చెప్పలేను గాని, సినిమాటోగ్రఫర్ గా నేను ముందే షార్ట్ వైజ్ గా చాలా ప్లాన్డ్ గా ఉంటాను. కెమరాకి సంబధించి పూర్తిగా నా కంట్రోల్ నే ఉంటుంది. ఇక డైరెక్షన్ అనేది చాలా వాటితో ముడిపడి ఉంటుంది. నటీనటులతో పాటు టెక్నీషియన్స్ ను కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

 

సినిమాకు ‘సెవెన్’ అని టైటిల్ ఎందుకు పెట్టారు ?

 

టైటిల్ అనేది కథను బట్టే పెట్టాం అండి. అయితే ఎందుకు పెట్టామో సినిమా చూసాక మీకే అర్ధమవుతుంది.

 

‘సెవెన్’లో ఏ అంశాలు బాగా ఆకట్టుకుంటాయి ?

 

సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగుంటాయి. సినిమలో ఎవరీ రోల్ చాలా ఇంట్రస్ట్ గా ఉంటుంది. అలాగే రొమాంటిక్ యాంగిల్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. స్క్రీన్ ప్లే బేస్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

 

హవీష్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

 

హవీష్ చాలా బాగా నటించాడు. తను వెరీ స్వీట్ పర్సన్. తనతో పని చేయడం చాలా హ్యాపీ.

 

ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. ఇంతమందిని కథలో భాగం చేయడం కష్టమనిపించలేదా ?

 

కథ వాళ్ళది కాబట్టి.. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇక ఆరుగురు హీరోయిన్స్ ఉన్నా.. ఎవరికీ ఎవరితో సంబంధం ఉండదు. ఎవరి కథ వాళ్ళది. చివర్లో అందరి కథలు కలుస్తాయి. ప్రతి హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆరుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా కథకు ముగింపు ఉండదు. కథనం అంత ఆసక్తికరంగా ఉంటుంది.

 

‘సెవెన్’కి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చేశారు. ఇబ్బంది పడిన సందర్భాలు?

 

ఏమీ లేవు. ఆపరేటివ్ కెమెరామేన్ ఒకరిని పెట్టుకున్నాను. కాకపోతే… పది రోజులు ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే… ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సెవెన్’ షెడ్యూల్స్ క్లాష్ అయ్యాయి. పగలు ‘శైలజారెడ్డి అల్లుడు’, రాత్రి ‘సెవెన్’ షూటింగ్ చేసేవాణ్ణి. ఒక సినిమాకు నేను సినిమాటోగ్రాఫర్. మరో సినిమాకు నేను డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ‘సెవెన్’ షెడ్యూల్ వాయిదా వేద్దామంటే ఆర్టిస్టుల డేట్స్ తో ఇబ్బంది. అందుకని, పది రోజులు నిద్రపోకుండా పని చేశా.

 

నెక్స్ట్ ఏంటి? సినిమాటోగ్రఫీ చేస్తారా? దర్శకత్వమా?

 

సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను. దర్శకుడిగా మారినందువల్ల సమస్యలు ఏవీ రావు. దర్శకుడిగా రెండు ఐడియాలు ఉన్నాయి. ఒకటి లవ్ స్టోరీ. మరొకటి థ్రిల్లర్. దర్శకుడిగా ఈ రెండు జానర్లు నాకిష్టమే. అవి డెవలప్ చేశాక, ఏదో ఒకటి చేస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు