ఇంటర్వ్యూ : మమ్ముట్టి – వైయస్సార్ పాత్రలోని ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించాను.

ఇంటర్వ్యూ : మమ్ముట్టి – వైయస్సార్ పాత్రలోని ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించాను.

Published on Feb 1, 2019 1:00 PM IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తోన్నారు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. కాగా ఈ సందర్భంగా మమ్ముట్టి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో నటిస్తున్నారు. ఎలా అనిపిస్తోంది ?

సంతోషంగా ఉంది. దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత, నేను మళ్ళీ తెలుగు సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ విన్నాక వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈ పాత్ర నాకు బాగా సూట్ అవుతుందని భావించాను.

మహి.వి.రాఘవ్ తీసినవి ఇప్పటివరకూ మూడు సినిమాలే కదా. ఆయనతో కలిసి పని చెయ్యడం గురించి చెప్పండి ?

ఇప్పటి వరకూ, నా కెరీర్ లో నేను డెబ్భై మంది కొత్త దర్శకులతో పనిచేశాను. వారితో పోల్చితే, మహి.వి.రాఘవ్ అనుభవజ్ఞుడైన మరియు తెలివైన డైరెక్టర్. పైగా రాఘవ్ చాలా మంచివాడు కూడా (నవ్వుతూ). అయిన స్క్రిప్ట్‌ బాగున్నప్పుడు ఎందుకు చెయ్యకూడదు. నిజానికి మహి.వి.రాఘవ్ చేసిన సినిమాలు ఒక్కటి కూడా చూడకముందే.. నేను ఈ సినిమా ఒప్పుకున్నాను.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

నేను వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బాడీ లాంగ్వేజ్, అలాగే ఆయన మ్యానరిజమ్స్ ని కాపీ చేయటానికి ప్రయత్నించలేదు. కానీ ఆయన పాత్రలోని ఆత్మను పట్టుకోవడానికి నా వంతుగా నేను ప్రయత్నించాను. అన్నిటికంటే ముఖ్యంగా డైరెక్టర్ మహి.వి.రాఘవ్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ తో నా దగ్గరకి వచ్చాడు. తనకు స్క్రిప్ట్ పై పూర్తి అవగాహన ఉంది. తన నమ్మకాన్ని చూసి నాకు కూడా నమ్మకం వచ్చింది.

అంటే వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి పాత్ర పై మీరు ఎలాంటి రీసెర్చ్ చెయ్యలేదా ?

ఆయన పాత్ర నేను ఎలాంటి రీసెర్చ్ చెయ్యలేదు. మొత్తం మా దర్శకుడే రీసెర్చ్ చేశాడు. తన విజన్ కి తగ్గట్లుగానే నేను ఈ సినిమాలో నటించాను.

ఈ సినిమా చేస్తోన్న క్రమంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ ని కలిసారా ?

జగన్ గారిని నేనెప్పుడూ కలవలేదు. అయితే ఆయన గురించి చాలా విన్నాను. ఆయన అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను.

మరి ఎప్పుడైనా వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారిని కలిశారా ?

లేదు. ఆయన్ని కూడా ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదు.

మీరు రాజకీయాల్లో అడుగుపెడుతున్నారా ?

దాదాపు నేను 38 సంవత్సరాల నుండి సినిమాల్లో నటిస్తున్నాను. నేను ఇక్కడ (నవ్వుతూ) సంతోషంగానే ఉన్నాను కదా. నేను రాజకీయాల్లో వెళ్ళటం అవసరమా.. ఇప్పటివరకూ అయితే ఆ ఆలోచన లేదు.

ఈ సినిమాకి తెలుగులో మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు ?

తెలుగు మరియు మలయాళం పదాల్లో చాలావరకు సారూప్యత ఉంటుంది. అందుకే డబ్బింగ్ చెప్పటం కుదిరింది. అయితే నా శైలిలోనే డబ్బింగ్ చెప్పాను.

మీరు ఇలాగే తెలుగులో కూడా సినిమాలు వరుసగా చేస్తారా ?

ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే కథ నచ్చాలి. ఏ దర్శకుడు అయిన, తన కథతో వచ్చి నన్ను ఒప్పిస్తే నేను తెలుగులో నటించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు