’బేవర్స్’, ‘సోదర’ చిత్రాల నటుడు సంజోష్ తన ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. మే 18న ఏటూరునాగారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా, గిరిజన ప్రాంతాలకు చెందిన 118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. పదవ తరగతిలో 500, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన దిగువ మధ్యతరగతి, గిరిజన విద్యార్థులను దీనికోసం ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు సంపూర్ణేష్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఏఎస్పీ మనన్ భట్, డీఈవో సిద్ధార్థ్ రెడ్డి, ఎంఈవో మల్లిక్, పూజారి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫౌండేషన్ సేవలను అభినందించారు.
సంజోష్ ఫౌండేషన్ ద్వారా గతంలో గిరిజన ప్రాంతాల్లో 168 మందికి ఉచితంగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు. అలాగే పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని పంపిణీ చేయడంతో పాటు, ముగ్గురు విద్యార్థుల చదువుకు సంజోష్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.


