ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో అలరించిన సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. గీతాంజలి మృతి పట్ల బాలకృష్ణ స్పందిస్తూ.. ‘గీతాంజలిగారు పరమపదించారినే వార్త తెలియగానే షాక్ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్ చేసిన సీతారామకళ్యాణం సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
కాగా 1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సీనియర్ హీరో రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి. 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. కాగా, ఆమె చివరి సినిమా దటీజ్ మహాలక్ష్మి. ఇక గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.


