ప్రస్తుతం తెలంగాణలో ప్రసిద్ధమైన మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. భక్తులు సమ్మక్క-సారలమ్మలను ముందస్తుగా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే, ఈ జాతరలో బంగారం గా పిలవబడే బెల్లంతో తులాభారం వనదేవతలకు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. కానీ, ఓ కుక్కకు బంగారం తూకం వేసింది ఓ తెలుగు హీరోయిన్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో సమ్మక్క-సారలమ్మ భక్తులు మండిపడుతున్నారు.
టాలీవుడ్‌లో కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో చిత్రాల్లో నటించిన నటి టీనా శ్రావ్య ఇటీవల తమ పెంపుడు కుక్కకు మేడారం జాతరలో తులాభారం చేయించింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తన పెంపుడు కుక్క అనారోగ్యం బారిన పడినప్పుడు దాని నుంచి కోలుకుంటే మేడారంలో బంగారం సమర్పిస్తానని తాను మొక్కుకున్నానని.. అందుకే తమ కుక్క బరువు ఉండే బంగారాన్ని తులాభారం వేయించానని చెప్పుకొచ్చింది.
కానీ, మేడారం జాతర సంప్రదాయం ప్రకారం, అక్కడి గిరిజనుల ఆచారం ప్రకారం ఇది తప్పని తెలుసుకున్న ఆమె ఇప్పుడు అందరికీ క్షమాపణలు చెప్పుకొచ్చింది. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని తాను అనుకోలేదని.. తనకు ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ తప్పు జరిగిందని.. ఇకపై ఇలాంటి తప్పులు చేయనని ఆమె మేడారం వనదేవతల భక్తులను కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
