సమీక్ష : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ – అలరించే కథనంతో ఆసక్తిగా సాగే క్రైమ్ డ్రామా !

సమీక్ష : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ – అలరించే కథనంతో ఆసక్తిగా సాగే క్రైమ్ డ్రామా !

Published on Jun 22, 2019 3:02 AM IST
Agent Sai Srinivasa Athreya movie review

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25 /5

నటీనటులు :  నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ,సుహాస్ తదితరులు.
దర్శకత్వం : స్వరూప్ రాజ్ ఆర్ జె ఎస్
నిర్మాత : : రాహుల్ యాదవ్ నక్కా
సంగీతం : మార్క్ కె రాబిన్
స్క్రీన్ ప్లే : సన్నీ కూరపాటి
ఎడిటర్: అమిత్ త్రిపాఠి

 

నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రలలో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ ఎలావుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

 

కథ:

 

ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) నెల్లూరు కేంద్రంగా చిన్నాచితకా కేసులను పరిష్కరించే, అంతగా పేరులేని  ఓ డిటెక్టీవ్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ పెద్ద కేసుని ఇన్వెస్టిగేట్ చేసి మంచి పేరు తెచ్చుకొని జీవితంలో స్థిర పడాలి అని ఎదురుచూస్తున్న ఆత్రేయకు అనుకోకుండా ఒకరోజు  రైలు పట్టాల ప్రక్కన అనుమానాదాస్పద స్థితిలో శవంగా మారిన ఓ యువతి కేసును ఛేదించే అవకాశం దక్కుతుంది.  దానితో  ఆ యువతి మరణం వెనుక వున్న వాస్తవాలను ఛేదించే దిశగా ఆత్రేయ తన విచారణ మొదలు పెడతాడు. ఆ యువతిని చంపిన ఆ నేరస్తులు ఎవరు ?  ఈ కేసులోని చిక్కుముడులను ఆత్రేయ ఎలా ఛేదిస్తాడు ? అనేది మిగతా  కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ మూవీకి ప్రధాన బలం  దర్శకుడు మూవీ కొరకు ఎంచుకున్న సబ్జెక్టు. కనిపించకుండా పోయి శవమై తేలిన వ్యక్తులకు సంబందించిన కేసును ఒక చిన్న డిటెక్టీవ్ ఛేదించిన విధానం కొత్తగా ఉంది.

హీరోగా నవీన్ కి మంచి ఆరంభం లభించిందని చెప్పాలి. వైవిధ్యం తో పాటు భిన్న కోణాలున్న తన పాత్రను చక్కగా పోషించాడు. హాస్యసన్నివేశాలలో తో పాటు సీరియస్ సన్నివేశాలలో కూడా అతని నటన కట్టిపడేసేలా ఉంది.

హీరోకి అన్నివేళలా తోడుగా ఉంటూ తన ఇన్వెస్టిగేషన్ లో తన వంతు సాయం చేసే అసిస్టెంట్ పాత్రలో హీరోయిన్ శృతి శర్మ యాక్టింగ్ బాగుంది. ఇక ప్రధాన పాత్రలలో కనిపించిన మిగతా నటులందరూ కొత్తవారైనప్పటికీ తమ పరిధిలో వారు నటించి మెప్పించారు. చివరి 10నిమిషాల వరకు కూడా కథలో సస్పెన్సు క్యారీ ఐయ్యేలా కథనం చక్కగా కుదిరింది.

సినిమాలోని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరో అదనపు ఆకర్షణ, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. హాస్య సన్నివేశాలలో నవీన్ నటన ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు నవీన్ పై తెరకెక్కిన కామెడీ సన్నివేశాలను ని బాగా ఎంజాయ్ చేస్తారు. చిత్రీకరణకు ఎంచుకున్న ప్రదేశాలు,అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంప్రెస్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

 

చివరి 15నిమిషాలు డైరెక్టర్ కథను సాగదీశాడనిపిస్తుంది. కథలో అసలు ట్విస్ట్ తెలిసిపోయాక కూడా అనవసర సన్నివేశాలతో మూవీ నెమ్మదించేలా చేశాడు.
చాల సన్నివేశాలు సాగదీతలా అనిపించడంలో  ఎడిటింగ్ వైఫల్యం కనపడుతుంది. ఒక పది నిమిషాల అనవసర నిడివి తగ్గిస్తే ఇంకా సినిమా బాగుండేది.

కేసుల విషయంలో పోలీసులు అంతగా పేరులోని ఓ చిన్న ఏజెంట్ ఆత్రేయ హెల్ప్ తీసుకోవడం అనేది కొంచెం నమ్మబుద్ది కాదు, వాస్తవికతకు అంతగా దగ్గరగా అనిపించదు.

 

సాంకేతిక విభాగం:

 

సాంకేతికంగా సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరక్కెక్కించారు. అద్భుతమైన విజువల్స్ కెమెరామెన్ పనితనాన్ని తెలియజేస్తాయి. అలాగే సందర్భానుసారంగా వచ్చే డైలాగులు, సన్నివేశాలకు ఫీల్ తెచ్చేలా  బి.జి.ఎం బాగా కుదిరాయి. మూవీ లైటింగ్ ఉత్కంఠ రేపే సన్నివేశాలకు వన్నె తెచ్చేలా ఉంది.  ఇక డైరెక్టర్ స్వరూప్ మొదటి సినిమాతోనే తన టాలెంట్ తో  ప్రేక్షకులకు మంచి సినిమా అందించారు.  కష్టతరమైన థ్రిల్లింగ్ స్టోరీని అర్ధమయ్యే విధంగా తెరపై చక్కగా ఆవిష్కరించాడు.  ప్రతి సన్నివేశాన్ని సునిశిత పరిశీలనతో తెరకెక్కించినట్లు ఉంది.  చివరి 15నిముషాలు మినహాయిస్తే సినిమా ఆసాంతం ఉత్కంఠ కలిగేలా కథనం నడిపాడు. ఈ మూవీ చూశాక టాలీవుడ్ కి ఓ మంచి దర్శకుడు దొరికాడని భావన రాక మానదు.

 

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే  “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” ఆసక్తి కరమైన కథనంతో సాగే ఉత్కంఠ రేపే ఓ మంచి కామెడీ థ్రిల్లర్.  ఆకట్టుకునే నటనతో పాటు, మంచి డైలాగ్ డిక్షన్ తో  నవీన్ పోలిశెట్టి హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి ప్రభావం చూపాడు.  వాస్తవికతకు దగ్గరగా ఉండే ఆసక్తికరమైన కథనం ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. చివరి 10నిమిషాలు మినహాయించి, ప్రేక్షకుడికి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ వారాంతపు సెలవులు ఓ మంచి మూవీతో ముగించాలనుకునే వారికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ బెస్ట్ చాయిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

123telugu.com Rating : 3.25 /5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు