ఆహా ఓటీటీలో ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ పేరుతో కొత్త షో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుందని నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటి మంచు లక్ష్మి, వైవా హర్ష, యాంకర్ రష్మి ఈ షోకు జ్యూరీగా వ్యవహరించనున్నారు.
గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియానా వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్-ప్రవీణ, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ ఈ షోలో టైటిల్ కోసం పోటీ పడనున్నారు. ఈ సందర్భంగా ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఫుడ్, ఫ్యాషన్, టూరిజం వంటి రంగాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం ఎక్కువగా ఉందని, అందుకే ఈ వైవిధ్యమైన షోను రూపొందించినట్లు చెప్పారు.
మహిళలు కోర్ టీమ్‌గా ఉండి ఈ కార్యక్రమాన్ని తెరకెక్కించడం పట్ల జ్యూరీ సభ్యురాలు మంచు లక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. కరోనా తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన మార్పులతో ఇన్‌ఫ్లుయెన్సర్లపై బాధ్యత కూడా పెరిగిందని రష్మి అభిప్రాయపడ్డారు. ఈ షో ద్వారా తెలుగు క్రియేటర్లకు మరింత మంచి గుర్తింపు లభిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.


