ఇటీవల ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’తో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో తిరువీర్, తాజాగా ‘ఓ..! సుకుమారి’(Oh..! Sukumar) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ క్యూట్ విలేజ్ ఎంటర్‌టైనర్‌లో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. ‘శివం భజే’ వంటి విలక్షణమైన చిత్రాన్ని అందించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదం, భావోద్వేగాలు మరియు హై-ఎనర్జీ డ్రామా కలబోతగా ఈ సినిమా రూపొందుతోంది.
ఇక ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్‌ను శనివారం రోజు విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘దామిని’ అనే చురుకైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. రంగురంగుల పరికిణీ వోణీ ధరించి, చేతుల్లో కర్రలు పట్టుకుని తనను తరుముతున్న గ్రామస్తుల నుండి తప్పించుకుని పరిగెడుతున్న దామిని లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘రజాకార్’, ‘పొలిమేర’ వంటి చిత్రాలకు పనిచేసిన సి.హెచ్ కుషేందర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా అప్పీల్‌తో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


