తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త చిత్రం ‘వాలిమై’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్లో భాగంగా అజిత్ బైక్ స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఆయన చేతికి, వేళ్లకు గాయాలయ్యాయి. గాయాలు కొంచెం పెద్దవే అయినప్పటికీ అజిత్ మాత్రం షూటింగ్ వాయిదా వేయలేదు. నిర్మాతను దృష్టిలో పెట్టుకుని పూర్తి షెడ్యూల్ ముగించాకే చెన్నై వెళ్లారు. ఈ గ్యాప్లో పూర్తిగా కోలుకున్న ఆయన ముందుగా అనుకున్న ప్రకారమే తర్వాతి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.
రేపటి నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. మొత్తం మీద గాయాలైనప్పటికీ అజిత్ మాత్రం సినిమాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. ఇకపోతే ఈ షెడ్యూల్ ముగిస్తే సినిమా మొత్తం పూర్తైనట్టే. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.


