
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ఎన్నై అరిందాళ్’. గత ఫిబ్రవరి నెల్లో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాను ‘ఎంతవాడు గానీ..’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (మే 22న) విడుదల కానుంది.
పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అజిత్, త్రిష, అనుష్క ఇలా లీడ్ క్యారెక్టర్స్ అందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కావడం ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు.
దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉండడం ఈ సినిమాకు మరింత కలిసివచ్చే అంశం. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు బాగానే థియేటర్లను కేటాయించారు. నైజాం ఏరియాలో సుమారు 100కు పైగా సెంటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక మిగతా అన్ని రీజియన్లలోనూ సినిమా ఎక్కువ కేంద్రాల్లోనే విడుదల కానుంది.

