
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కావాల్సిన అప్పట్లో కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు దీపావళి కానుకగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులే ఉండడంతో అఖిల్ టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్, హీరో అఖిల్ ఇలా అందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకున్న విపరీతమైన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మేజర్ టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ సోషల్ మీడియా ప్రచారాలతోనే సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ టీమ్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారాలను మొదలుపెట్టింది. ఇక ఈ సాయంత్రం హీరో అఖిల్ స్వయంగా అభిమానులతో ట్విట్టర్‌లో చాట్ సెషన్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అఖిల్ ట్విట్టర్‌లో ‘ఆస్క్ అఖిల్’ ట్యాగ్‌తో తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తారు. ఇక ఈ సినిమా భారీ రిలీజ్ విషయంలో నితిన్ పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు.

