సమీక్ష : వెల్‌కమ్ టు ది జంగిల్ – కామెడీ సీన్స్ ఫుల్.. నవ్వులు మాత్రం నిల్..

సమీక్ష : వెల్‌కమ్ టు ది జంగిల్ – కామెడీ సీన్స్ ఫుల్.. నవ్వులు మాత్రం నిల్..

Published on Jun 27, 2026 1:03 AM IST

Welcome To The Jungle Review

విడుదల తేదీ : జూన్ 26, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్, రవీనా టాండన్ తదితరులు
దర్శకత్వం : అహ్మద్ ఖాన్
నిర్మాతలు : ఫిరోజ్ నడియాడ్వాలా, రాకేష్ దంగ్, వేదాంత్ వికాస్ బాలి
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, ఆనంద్ రాజ్ ఆనంద్, తల్వీందర్, సాజిద్-వాజిద్
ఛాయాగ్రహణం : కబీర్ లాల్
కూర్పు: నితిన్ పాఠక్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్‌లో పాపులర్ అయిన ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా వచ్చిన చిత్రం ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్-అహ్మద్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఒక బడా వ్యాపారవేత్త వద్ద ఉన్న బ్లాక్‌మనీ తెల్లధనంగా మార్చుకోవడానికి ఒక వింత ప్లాన్ వేస్తాడు. ఇండస్ట్రీలోనే అత్యంత వరస్ట్ డైరెక్టర్లయిన దేవ్ (రాజ్‌పాల్ యాదవ్), దాస్ (పరేష్ రావల్)లను పిలిచి ఎలాగైనా ఒక భారీ డిజాస్టర్ సినిమా తీసి కోట్లలో నష్టాలు చూపించాలని టాస్క్ ఇస్తాడు. ఈ క్రమంలో ఒక ఫెయిల్యూర్‌ స్టార్ రాజీవ్ (అక్షయ్ కుమార్), గ్యాంగ్‌స్టర్స్ రోమియో (అర్షద్ వార్సి), యేడా అన్నా(సునీల్ శెట్టి)లతో పాటు ఒక వింత టీమ్‌ను సెట్ చేస్తారు. షూటింగ్ కోసం వీరంతా ఒక అడవిలో ఉండే ఊరికి వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన వింత పరిస్థితులు ఏంటి? ఈ గందరగోళం మధ్య ఆ సినిమా పూర్తయిందా లేదా? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

వెల్‌కమ్ ఫ్రాంచైజీలో చిత్రం అనగానే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. దానికి తోడు చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబినేషన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం ఓల్డ్ క్లాసిక్ కామెడీలను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ తన ఎనర్జీతో కొన్ని సీన్లను ఒంటిచేత్తో లాక్కొచ్చాడు.

సినిమా ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక 20 నిమిషాల సీక్వెన్స్ మాత్రం థియేటర్లలో మంచి నవ్వులు పూయిస్తుంది. ఆ సమయంలో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా, జోకులు బాగా పేలాయి.

జానీ లీవర్, అర్షద్ వార్సి, శ్రేయాస్ తల్పడే లాంటి సీనియర్ కమెడియన్లు ఉండటం వల్ల అక్కడక్కడా కొన్ని సిట్యుయేషనల్ కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ :

‘వెల్‌కమ్’ మొదటి భాగంలో ఉన్నంత షార్ప్ స్క్రీన్‌ప్లే, లాజిక్ ఈ సినిమాలో అస్సలు కనిపించవు. కథలో క్లారిటీ లేకపోవడం, కేవలం జోకుల కోసమే సీన్లను ఇరికించినట్టు అనిపించడం సినిమాకు పెద్ద మైనస్.

సినిమాలో దాదాపు ఇరవై మందికి పైగా పేరున్న నటీనటులు ఉన్నారు. స్క్రీన్ నిండా క్యారెక్టర్లు కనిపిస్తూ గందరగోళం సృష్టిస్తారే తప్ప, చాలా మంది పాత్రలకు సరైన ప్రాధాన్యత లేదు. లారా దత్తా, జాక్వెలిన్ లాంటి వారి పాత్రలు చాలా వీక్‌గా ఉన్నాయి. దిశా పటాని హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు సాలిడ్ పాత్ర పడలేదు.

సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు ఉండటం ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. సెకండాఫ్‌లో చాలా సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఒక స్టార్ సినిమాకు కావలసిన విజువల్ క్వాలిటీ మిస్ అయింది. గ్రాఫిక్స్ వర్క్ మరీ వీక్‌గా అనిపించింది. ఫస్ట్ పార్ట్‌లోని ‘ఎక్ ఉంచా లంబా కథ్’ పాట రీ-మిక్స్ మినహా పాటలు కూడా ఏమాత్రం గుర్తుంచుకునేలా లేవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అహ్మద్ ఖాన్ ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీ క్రేజ్‌ను వాడుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ దానికి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోలేకపోయాడు. ఈ సినిమాలో డైలాగ్స్ కొన్ని బాగున్నా, చాలా వరకు పాతవి లాగే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు భారీగా ఉన్నా, స్క్రీన్‌పై విజువల్ ఎఫెక్ట్స్, గ్రీన్ స్క్రీన్ వర్క్ చాలా నాసిరకంగా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది.

తీర్పు :

మొత్తంగా చూసుకుంటే, ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ చిత్రానికి ఈ ఫ్రాంచైజీలోని మిగతా చిత్రాలను చూసి వచ్చినవారికి నిరాశ తప్పదు. అక్షయ్ కుమార్ ఎనర్జీ, ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే కొన్ని నవ్వులు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. వీక్ రైటింగ్, బలవంతంగా పండించే కామెడీ, లాంగ్ రన్‌టైమ్ సినిమాకు డ్యామేజ్ చేశాయి. ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీ లవర్స్‌కు, కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ మూవీ కనెక్ట్ కాకపోవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు