
తమిళ హీరో శింబు గురించి తెలుగులోనూ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సింగర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా చాలా పాత్రల్లో మెప్పించిన ఈ హీరోను తాజాగా ఓ సినిమా తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ వస్తోంది. శింబు హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన ‘వాలు’ అనే సినిమా 2012లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక కారణాలతో మూలన పడింది. ఆ తర్వాత చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జూలై 17కు ఫిక్స్ అయింది. అయితే మ్యాజిక్ రే అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సినిమా విడుదలను నిలిపివేసింది.
ఇక దీంతో గత మూడేళ్ళుగా వేరే ఇతర సినిమాలేవీ చేయక, ‘వాలు’ విడుదల కాక, శింబు కెరీర్ దాదాపుగా అస్తవ్యస్తమైంది. శింబు తండ్రి రాజేందర్ చొరవతో ఈ సినిమా విడుదలకు సిద్ధమైనా మరొక సారి వాయిదా పడడంతో అభిమానులూ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఇబ్బందులన్నీ సమసిపోయినట్లు తెలుస్తొంది. మ్యాజిక్ రే కేసును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దీంతో వాలు సినిమాకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లే! అన్నీ కుదిరితే ఆగష్టు 14న ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

