దర్శకుడు అనుదీప్ కెవి ‘జాతిరత్నాలు’ సినిమాతో ఓ మెరుపు మెరిసినా, ఆ తర్వాత వచ్చిన ‘ప్రిన్స్’, ‘ఫంకీ’ చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. క్లిప్పుల వరకు కామెడీ బాగానే ఉన్నా, వెండితెరపై పూర్తి స్థాయి వినోదాన్ని పంచడంలో ఆయన విఫలమవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు అనుదీప్ తన నెక్స్ట్ చిత్రాన్ని హీరో నితిన్‌తో చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ముందుకు వస్తోంది. ప్రస్తుతం నితిన్, అనుదీప్ ఇద్దరూ వరుస ఫ్లాపుల్లో ఉండటంతో, ఈ కాంబినేషన్ ద్వారా ఒక గట్టి హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని పట్టుదలతో ఉన్నారు.
తన విలక్షణమైన కామెడీ టైమింగ్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుదీప్‌కు ఇది చావో రేవో లాంటి పరీక్ష. కేవలం ముక్కలు ముక్కలుగా జోకులు కాకుండా, బలమైన కథనంతో ప్రేక్షకులను మెప్పిస్తేనే ఆయన బ్రాండ్ ఇమేజ్ నిలబడుతుంది. మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో వేచి చూడాలి.


