కోవిడ్ కారణంగా కుదేలైన రంగాల్లో సినీ, థియేటర్ రంగాలు కూడ ఉన్నాయి. మామూలు రోజుల్లో నిత్యం షూటింగ్లు, సినిమాల విడుదలతో పరిశ్రమ కళకళలాడేది. థియేటర్లలో గ్యాప్ లేకుండా సినిమాలు వస్తూ ఉండేవి. లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉండేవారు. కానీ ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో కార్మికుల పరిస్థితి తలకిందులైంది. సినిమా షూటింగ్లు మొదలైనప్పటికీ థియేటర్లు తెరుచుకోలేదు. ఏడు నెలలుగా బిజినెస్ లేకపోవడంతో కొన్ని సినిమా హాళ్లు శాశ్వతంగా మూతబడి గొడౌన్లుగా మారిపోయాయి.
కనీసం కరెంటు బిల్లులు కూడ కట్టలేని పరిస్థితి ఉంది చాలా చోట్ల. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ రంగానికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకుంది. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో 3 నెలలపాటు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయాలని, మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ఛార్జీలు చెల్లింపును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వనున్నారు.
ఏ, బి సెంటర్లలో థియేటర్లకు 10 లక్షల చొప్పున, సి సెంటర్లలోని థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు ఇస్తారు. వాయిదా చెల్లింపులపై 6 నెలల మారటోరియం విధించి తర్వాతి సంవత్సరం నుండి వడ్డీలో నాలుగున్నర శాతాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీని ద్వారా 1100 థియేటర్లకు లబ్ది చేకూరనుంది. ఈ వెసులుబాట్లు నష్టాల్లో నెట్టుకొస్తున్న థియేటర్ యాజామాన్యాలకు చేయూతగా నిలవనున్నాయి.


