స్టార్ హీరోల వల్ల మూవీ ఫ్యాన్స్ తగ్గిపోతున్నారా ?

Published on May 2, 2019 11:00 pm IST

ఇప్పటి మన స్టార్ హీరోలు ఒకే ఏడాది మూడు సినిమాలు.. పోనీ రెండూ.. కనీసం ఒకటి.. ఫలానా స్టార్ హీరో నుండి ఖచ్చితంగా ఏడాదికి ఒక సినిమా వస్తుందని ఇప్పుడు నమ్మకంగా చెప్పగలమా ?.. ఇప్పటి పరిస్థితుల్లో అలా చెప్పడం నిజంగా అతిశయోక్తే ! కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు లాంటి స్టార్‌ హీరోలంతా జయాపజయాలకు అతీతంగా ఏడాదికి ఏడు ఎనిమిది సినిమాలు చేసేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఓ ఏడాది ఏకంగా పదిహేను సినిమాలకు పైగానే చేశారట. ముఖ్యంగా 1964 నుంచి 1995 వరకు సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఒక్క కృష్ణనే కాదు అప్పటి హీరోలందరూ రోజుకి మూడు, నాలుగు కాల్షీట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పటి స్టార్స్‌ గ్యాప్ లేకుండా రోజుకి ఒక్క కాల్షీట్‌ ఇవ్వడం.. గగనమే.

పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్ల మూస ధోరణికి బ్రేక్‌ వేస్తూ.. సరికొత్త ప్రయోగాలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ.. స్టార్ల అనే ఇమేజ్‌ చట్రాల మధ్య నలిగిపోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకోవచ్చు. సినిమా సినిమాకి అభిమానులనూ పెంచుకోవచ్చు. ఎన్టీఆర్ ఇలానే చేశారు. ‘పాతాళ భైరవి’ లాంటి ఆల్ టైం మాస్ ఫిల్మ్ చేసాక కూడా.. ‘పిచ్చి పుల్లయ్య’ ‘కలసి ఉంటే కలదు సుఖం’ లాంటి అచ్చ కుటుంబ కథా చిత్రాలతో వెండి తెర పై తెలుగు కమ్మదనాన్ని అద్దారు. తెలుగు ప్రేక్షకులకు మధురమైన చిత్రాలను అందించారు. ఎన్టీఆర్ తో పాటూ ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర స్టార్‌ లంతా ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్లే విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన చిత్రాల్లో నటించి తమకంటూ ఒక బాణీని ఏర్పర్చుకున్నారు.

అందుకేనేమో అప్పటి హీరోల్లో ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక శైలి ఉంటుంది. మరి ఇప్పటి హీరోల్లో..? వాస్తవం మాట్లాడుకుంటే సగంమందిది ఒకటే శైలి కదా !. కారణం.. పదేళ్ల కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చెయ్యలేకపోవడం. ఎక్కువ సినిమాలు చేస్తే.. వాటిల్లో ఎదొక సినిమా సూపర్ హిట్ అవుతుంది. అభిమానులు ఆ సినిమా విజయంతో తమ అభిమాన హీరోని ఆరాధిస్తూ అలాగే కొనసాగేవారు. అందుకే ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకూ ఎప్పటికప్పుడూ అభిమాన సంఘాల హడావుడి కనిపించేది. అయితే, ఇప్పటి స్టార్స్ కు కూడా చొక్కాలు చింపుకునే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ హడావుడే లేదు. పైగా యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ల రాకతో సినిమా స్థితి పరిస్థితే కాదు, ప్రేక్షకుల ఆలోచనలూ పూర్తిగా మారిపోయాయి. ఒక విధంగా సినిమాలు ఇచ్చే ఎంటర్ టైన్మెంట్ కంటే.. డిజిటిల్ అండ్ టీవీ ప్లాట్ ఫామ్స్, ముఖ్యంగా ఐపియల్, ప్రో కబడ్డీ, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ వంటివి ఇచ్చే ఎంటర్ టైన్మెంటే ఎక్కువు. ఎప్పటికప్పుడు అవి అప్ డేట్ అవుతూ.. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు అతి వేగంగా మారుతూ.. ప్రేక్షకులను తమ వైపుకు తిప్పుకుంటున్నాయి పైన చెప్పుకున్న ఎంటర్ టైన్మెంట్ రంగాలు.

అందుకే, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా సరే.. ఆ సినిమాకి హిట్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు కదులుతున్నారు. అదే ఆ సినిమాకు యావరేజ్, బిలో యావరేజ్ టాక్ వస్తే మాత్రం.. ఎలాగూ నెల రోజుల్లో ఏ అమెజాన్ ప్రైమ్ లోనే, నెట్ ఫ్లిక్స్ లోనే చూడొచ్చులే అని.. ప్రేక్షకుడు ఆ ప్లాప్ సినిమాని లైట్ తీసుకుంటున్నారు. అందుకే, ప్లాప్ టాక్ తెచ్చుకున్న స్టార్ హీరోల సినిమాలకు భారీ మొత్తంలో నష్టాలు వస్తున్నాయి. ఈ మధ్యలో ఏ చిన్న సినిమాకైనా బాగుందన్న కనీస స్పందిన వచ్చిందా.. ఇక అంతే, ప్రేక్షకులు ఆ సినిమాకే పట్టం కడుతున్నారు. ప్రస్తుతం హోలీవడ్ లో ఈ ట్రెండే నడుస్తోంది. ఒకప్పుడు అక్కడ కూడా మనకు లాగే స్టార్స్ హవానే ఎక్కువ. కానీ ఆ స్టార్స్ కూడా మన స్టార్స్ ల్లానే ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చేసి.. వాళ్ళ ప్రేక్షకులను ‘సినిమా హిట్ అయితేనే చూస్తాం’ అనేలా పూర్తిగా మార్చేశారు.

ఇప్పుడక్కడ ‘ఫలానా స్టార్ హీరో సినిమా వస్తోంది చూద్దాం’ అనే వాళ్ళకంటే.. ‘ఫలానా మూవీకి హిట్ టాక్ వచ్చిందంటా, చూద్దాం’ అనే వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు తెలుగులో కూడా ఈ పరిస్థితే కనిపిస్తోంది. ఒకపక్క డిజిటల్ ప్లాట్ ఫామ్ యూత్ ని మైకంలో పడేసిన వేళ, మరోపక్క టీవీ మీడియా ఫ్యామిలీస్ ను పూర్తిగా ఆకర్షించిన నేపథ్యంలో.. ప్రేక్షకులు ఇంకా సంవత్సరాలు తరపడి స్టార్ హీరోల సినిమాల కోసం ఎందుకు పడిగాపులు కాయాలి ? ఎందుకు కాస్తారూ ? ఇప్పటికైనా, స్టార్ హీరోలూ మేలుకోకుండా ఇలాగే తమ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తే మాత్రం.. చేజేతుల్లారా తమ ఫ్యాన్స్ ను తామే కోల్పోయిన వాళ్లవుతారు. అలా కాకుండా, ప్రతి స్టార్ హీరో ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చెయ్యాలని.. చేస్తారని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More