
సౌతిండియన్ సినిమాల్లో హీరోయిన్‌గా సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అనుష్క, తాజాగా సైజ్ జీరో పేరుతో ఓ పెద్ద సాహసమే చేసిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఏకంగా 25 కేజీలకు పైనే బరువు పెరిగి సంచలనంగా నిలిచారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి అనుష్క, ఆర్యలతో పాటు మిగతా టీమ్ మొత్తం విచ్చేశారు.
ఇక ఈ సందర్భంగా సినిమాలు, పాత్రల ఎంపికలో అనుష్క సాహసాన్ని ప్రశంసిస్తూ హీరో ఆర్య.. విశ్వనటుడు కమల్ హాసన్, తమిళ స్టార్ హీరో విక్రమ్‌ల డెడికేషన్ కలిస్తే అనుష్క అంటూ వ్యాఖ్యానించారు. ఒక పాత్ర కోసం ఇంత పెద్ద సాహసం చేయడం అనుష్కకే చెల్లిందని ఆర్య పేర్కొన్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌తో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియో వేడుక నవంబర్ 1న హైద్రాబాద్‌లో జరగనుంది. కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.