ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ మొదలైందంటే, తమ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు బయటకు వస్తాయా అని మేకర్స్ భయపడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇది మరీ పెద్ద సమస్యగా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ కూడా లీకుల సమస్యను ఎదుర్కొంది. తమ కంటెంట్, యాక్టర్స్ లుక్స్ బయటకు లీక్ కాకుండా ఉండేందుకు మేకర్స్ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
కానీ, ఇప్పుడు డైరెక్టర్స్‌లో దర్శకుడు అట్లీ మాత్రం తనదైన ప్లానింగ్‌తో లీకులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రంగా తెరకెక్కుతున్న AA22 మూవీని అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. ముంబైలోని ఒక స్టూడియోలో గత ఆరు నెలలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ, ఒక్కటంటే ఒక్క ఫోటో లేదా వీడియో కూడా బయటకు రాకపోవడం విశేషం. టైటిల్, జానర్ వంటి ప్రాథమిక విషయాలు కూడా లీక్ కాకుండా చిత్ర యూనిట్ అత్యంత గోప్యతను పాటిస్తోంది.
దీని కోసం నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మరియు దర్శకుడు అట్లీ బృందం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనే ప్రతి నటుడు మరియు టెక్నీషియన్ నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి వచ్చింది. అలాగే సెట్స్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేసి, ప్రతి అడుగును నిఘా నీడలో ఉంచారు. సెట్‌లోకి అతిథులను అనుమతించకపోవడమే కాకుండా, యూనిట్ సభ్యుల ఫోన్లపై కూడా కండీషిన్స్ విధించడంతో లీకులకు అడ్డుకట్ట పడింది. ప్రేక్షకులకు వెండితెరపై నేరుగా ఒక గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో, కంటెంట్‌ను ఇంత పకడ్బందీగా కాపాడుతున్న ఈ చిత్ర యూనిట్ పనితీరును అందరూ అభినందిస్తున్నారు.


